రష్యా – ఉక్రెయిన్ల మధ్య మూడో విడత చర్చలు ప్రారంభమయ్యే వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ గనక మా షరతులను ఒప్పుకొని, ఏ కూటమిలో చేరకుండా ఉంటే యుద్ధాన్ని తక్షణమే ఆపేస్తామని తెలిపింది. రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ దిమిత్రి పెస్కోవ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ తమ కండీషన్లను
ఒప్పుకున్నట్లైతే తక్షణమే సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంతేకాక, ఉక్రెయిన్ భవిష్యత్తులో ఏ కూటమిలోనూ చేరకుండా ఉండేందుకు రాజ్యాంగాన్నిసవరించాలని డిమాండ్ చేశారు. కాగా, ఇరు దేశాల మధ్య మూడో విడత శాంతి చర్చలు ఇవ్వాళ సాయంత్రం 7.30 గంటలకు జరుగుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఇలాంటి ప్రకటన రావడం గమనార్హం. ఇదిలా ఉండగా, రష్యాకు చెందిన ఇద్దరు అత్యున్నత మిలటరీ కమాండర్లను హతమార్చామంటూ ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది.