సర్కారు బడిలో చేరితే.. రూ.500, పుస్తకాలు, దుస్తులు ఫ్రీ: సర్పంచ్ - MicTv.in - Telugu News
mictv telugu

సర్కారు బడిలో చేరితే.. రూ.500, పుస్తకాలు, దుస్తులు ఫ్రీ: సర్పంచ్

June 6, 2022

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌ సర్పంచ్ కొడగూటి శారద ఓ సంచలన ప్రకటన చేశారు. శాలపల్లి, ఇందిరానగర్‌ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లలకు నెలకు రూ. 500 చొప్పున ప్రోత్సాహకంతోపాటు వారికి దుస్తులు, పుస్తకాలకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్ కొడగూటి శారద తీసుకున్న నిర్ణయంపై అధికారులు, పిల్లల తల్లిదండ్రులు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్లపై తల్లిదండ్రులకు, పిల్లలకు సర్పంచ్ కొడగూటి శారద గతకొన్ని రోజులుగా వీధి వీధి తిరిగి అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెంచేందుకు, వాటికి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు ఆమె కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో భాగంగా తన వంతుగా పిల్లలకు నెలకు రూ. 500, వారికి దుస్తులు, పుస్తకాలను ఉచితంగా అందజేస్తానని హామి ఇచ్చారు.

ప్రస్తుతం ఆ రెండు గ్రామాల్లో ఉన్న ఆ పాఠశాలల్లో 70 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కనీసం మరో 50 మందిని చేర్పించాలని సర్పంచ్ శారద తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పిస్తున్నారు.