ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం కొలువుతీరేందుకు సమయం ఆసన్నమయింది. ప్రస్తుత కేబినెట్‌తో చివరిసారిగా గురువారం జగన్ భేటీ కాబోతున్నారు. అయితే, ఇప్పుడున్న మంత్రులందరూ పదవులను వదిలేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటీకే పేర్ని నాని మంత్రిగా తన అధ్యాయం ముగిసిందని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో బుధవారం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ”టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని నేను కాదని చెప్పలేను. నేను మంత్రిగా దిగిపోతున్నాను. తర్వలోనే నా సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి కాబోతున్నాడు. వైఎస్ మరణం తర్వాత నేను జగన్ వెంట నడిచాను. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశాను. గతంలో తమ్ముడు ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు నరసన్నపేట ఉపఎన్నికలో నాపై మరో సోదరుడు రామదాసును బరిలోకి దించాడు. ఆ ధర్మ యుద్ధంలో నేనే గెలిచా” అని కృష్ణదాస్ అన్నారు.
అంతేకాకుండా 2019 ఎన్నికల్లో తమ్ముడు ప్రసాదరావు కూడా వైసీపీ నుంచి పోటీ చేశాడని, ఎన్నికల్లో ఇద్దరం గెలిచామని చెప్పారు. జగన్ తనను గుర్తించి డిప్యూటీ సీఎం చేశారని, మూడేళ్లు ఖాళీగా ఉన్న తమ్ముడు రేపో, మాపో మంత్రి అవుతాడని అన్నారు. ఎవరు మంత్రిగా ఉన్నా, తమ కుటుంబమంతా ఒక్కటేనని చెప్పారు. దీంతో ఆయన మాటలను విన్న పార్టీ కార్యకర్తలు డిప్యూటీ సీఎం పదవి నుంచి ఆయన ఔట్ అయ్యారు అని చర్చించుకుంటున్నారు.