If the people of Telangana bless us, we will go into national politics ,says CM KCR
mictv telugu

దేశ రాజకీయాల్లోకి పోతాం.. తెలంగాణలాగే దేశాన్ని బాగు చేస్తం

September 5, 2022

బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. నిజామాబాద్లో కలెక్టరేట్ భవనం ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. నాటి నేతలు చిన్న పొరపాటు చేస్తే మనం 60 ఏళ్లు పోరాడాల్సి వచ్చిందని తెలిపారు. రాజకీయాల్లో ఏం జరుగుతుందో పరిశీలిస్తూ ఉండాలని, పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు పోవాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలుకావడం లేదన్నారు. రైతులకు ఉచితంగా నిరంతర విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

“రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ చెబుతున్నారు. రైళ్లు, విమానాలు, ప్రభుత్వ సంస్థలు విక్రయించి.. ఇప్పుడు రైతుల మీద పడ్డారు. రైతుల భూములను తీసుకొని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించాలని చూస్తున్నారు. ఎరువుల ధరలు, వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో సాగు భారంగా మారింది. మిగిలింది రైతుల దగ్గర ఉన్నా భూమి మాత్రమే. మోటార్లకు మీటర్లు పెడితే భరించలేక మనం వ్యవసాయం మానేయాలి. అప్పుడు రైతుల దగ్గర భూములు లాక్కోవాలనేదే కేంద్రం యోచన. రైతులు భూములు కొనేందుకు అప్పుడు కార్పొరేట్ సంస్థలు వస్తాయి. వ్యవసాయాన్ని ఆపేసి రైతుల భూములు కొట్టేయాలనేదే కుట్ర. దేశం కోసం తెలంగాణ నుంచే పోరాటం చేయాలి. ఎవరైతే బావుల వద్ద మీటర్ పెట్టాలంటున్నారో, ఎవరైతే రైతులను ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవాలంటున్నారో వారికే మనం మీటర్ పెట్టాలి”. అప్పుడే మనం బాగుపడతాం అంటూ ప్రసంగించారు.

ఉన్నవి అమ్ముకోవడం తప్ప ఈ మోదీ ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? ఒక్క ఫ్యాక్టరీ అయినా పెట్టాడా? అంటూ నిలదీశారు. ఇప్పుడు మోటర్లకు మీటర్లు పెట్టి అన్నీ గుంజుకుంటే మనం శంకరగిరి మాన్యాలు పట్టి కూలిపనులు చేయాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామంలో రైతు బిడ్డలు, రైతు సంఘాలు సమావేశమై, ఏ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబించినా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగిత పెరిగిపోయిందని, రూపాయి విలువ పడిపోయిందని, ఎవరినీ ఉద్ధరించింది లేదని విమర్శించారు. “ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను కూలదోయడమే మోదీ చేస్తున్న ఏకైక పని. దేశ రాజకీయాల్లోకి రావాలని జాతీయస్థాయి రైతు నాయకులు నన్ను అడిగారు. తెలంగాణ ప్రజలు దీవిస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాం. కాలువల్లో నీరు పారాలో? మతపిచ్చితో రక్తం పారాలో? ప్రజలు ఆలోచించుకోవాలి. నిజామాబాద్‌ గడ్డ నుంచే జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తా’’ అని కేసీఆర్‌ అన్నారు.