టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) దర్యాప్తును రద్దుచేసి సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కి బదిలీ చేయాలని బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్‌రెడ్డి, సిట్ జారీచేసిన 41 ఏ నోటీసును సవాలుచేస్తూ ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్, తుషార్, శ్రీనివాస్ ఇతరులు దాఖలుచేసిన వేర్వేరు వ్యాజ్యాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం సమగ్ర విచారణ జరిపారు. దాదాపు 4గంటలపాటు ఈ కేసుపై వాడి వేడిగా వాదనలు జరిగాయి.
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందని, అందులో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరిగింది కాబట్టే టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ విషయాలను మీడియాకు వెల్లడించారని, కుట్ర విఫలమైన విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత సీఎంపై ఉన్నదని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుంటే.. పార్టీ అధినేత హోదాలో ఉన్న సీఎం కేసీఆర్ మాట్లాడకుండా ఎలా ఉండగలరని ప్రశ్నించారు. కచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు.
ఒకవేళ బీజేపీ నిజంగా తప్పు చేయకపోతే దర్యాప్తునకు సహకరించాలి కదా అని ప్రశ్నించారు. బీజేపీకి సంబంధమే లేనప్పుడు నిందితుల తరఫున కేసులు ఎందుకు వేస్తున్నదని నిలదీశారు. నిందితులు సిట్ దర్యాప్తునకు సహకరించకపోగా అడుగడుగునా కేసును అడ్డుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర గురించి తీవ్రంగా ఆలోచన చేయాలని విజ్ఞప్తిచేశారు. సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగుతున్నదని, సీబీఐకి బదిలీచేస్తే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసే లక్ష్యంతోనే ఈ తరహా ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఉండటం సహజమని.. తమ ఉనికి ప్రమాదంలో పడినప్పుడు పోరాటం చేస్తాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా సీఎం ప్రజల్లోకి యుద్ధాన్ని తీసుకెళ్లి చైతన్యపరుస్తున్నారని తెలిపారు.