లంచం అడిగితే.. ఈ‘యాప్‌’తో కొట్టండి - MicTv.in - Telugu News
mictv telugu

లంచం అడిగితే.. ఈ‘యాప్‌’తో కొట్టండి

May 19, 2022

ఆంధ్రప్రదేశ్‌లో లంచాలు, అవినీతి లేకుండా ప్రభుత్వ పాలన సాగాలని, అధికార యంత్రాంగానికి జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే పలు కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఓ మొబైల్‌ యాప్‌ను రూపొందించాలని జగన్ మోహన్ రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను అనుసరించిన అధికారులు.. అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు మొబైల్‌ యాప్‌ను తయారు చేశారు.

ఈ క్రమంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ‘14400 యాప్‌’ను రూపొందించి, జగన్ మోహన్ రెడ్డికి సమర్పించారు. లంచగొండుల పాలిట సింహ స్వప్నంలా ఈ యాప్‌ను తయరు చేశామని, ఇక నుంచి ప్రజలు ఏ శాఖలోనైనా అధికారులు లంచాలు అడిగితే తక్షణమే 14400 టోల్‌ఫ్రీ నంబరులో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఈ యాప్‌ను జగన్‌ త్వరలోనే ఆవిష్కరించనున్నారు.

ఈ యాప్ ద్వారా.. ఆడియో, వీడియో, ఫొటో ఆధారాలతో సహా ఫిర్యాదు చేయొచ్చు. లైవ్‌ రిపోర్టింగ్‌ ఫీచర్‌లో ఫొటో,వీడియో, ఆడియో, ఫిర్యాదు నమోదు ఆప్షన్లు ఉన్నాయి. లంచం తీసుకుంటున్న లైవ్‌ ఫొటో తీసి ఆ యాప్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు. లంచం అడుగుతున్నప్పుడు మాటలను లైవ్‌లో రికార్డ్‌ చేసి అప్‌లోడ్‌ చేయవచ్చు. లైవ్‌ వీడియో కూడా రికార్డు చేసి అప్‌లోడ్‌ చేయవచ్చు. లైవ్‌ రిపోర్ట్‌కు అవకాశం లేకపోతే, బాధితులు అప్పటికే రాసి ఉంచిన ఫిర్యాదు కాపీగానీ సంబంధిత ఫొటోలు, ఆడియో, వీడియో రికార్డింగ్‌లను కూడా యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయవచ్చు.