ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు మాంద్యం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రజలు ఆర్థికంగా బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు లే ఆఫ్ మొదలుపెట్టాయి. ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందో అర్థంకాని పరిస్థితి. కాబట్టి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇది పెద్ద ప్రశ్నే. దీనికి మీ దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. అయితే ఈ మార్గాల్లో డబ్బును పొదుపు చేసినట్లయితే..కష్టకాలంలో మీకు ఎలాంటి సమస్య ఉండదు.
1. క్రెడిట్ కార్డ్ వాడటం గొప్ప కాదు.
ఈ రోజుల్లో చాలామంది క్రెడిట్ కార్డు ఉపయోగించడం గొప్ప స్టేటస్ గా భావిస్తున్నారు. ఒక్కరి దగ్గర రెండు క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. మనం ఖర్చు చేసే ప్రతి పైసకు వడ్డీతో తిరిగి చెల్సించాలి అని ఆలోచించకుండా విచ్చలవిడిగా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటారు. అలాంటి ఖర్చులు మిమ్మల్ని ప్రమాదంలో నెట్టెస్తాయి. క్రెడిట్ కార్డుతో అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయండి. వీలైతే డెబిట్ కార్డును ఉపయోగించండి. ఇది అదనపు ఖర్చు నుంచి మిమ్మల్ని ఆదా చేస్తుంది.
2. నెలవారీ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ప్లాన్:
మనకు వస్తున్న జీతం, ఆదాయానికి అనుగుణంగా బడ్జెట్ ప్రకారం ప్లాన్ వేసుకోవడం ముఖ్యం. ఇంట్లోకి అవసరమైన వస్తువుల జాబితాను ముందుగానే తయారు చేయండి. దానికోసం డబ్బును కేటాయించండి. లగ్జరీలకు దూరంగా ఉండటం మంచిది. మిగిలిని డబ్బును ఆదా చేయడం గురించి ఆలోచించండి. లగ్జరీ కోసం ఖర్చు చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇలా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.
3. అప్పులు చేసి ఖర్చు చేయకూడదు:
అప్పు చేసి నెయ్యి తాగడమనే సామేత..నేటికాలంలో కరెక్టుగా కనిపిస్తోంది. క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు అందుబాటులోకి వచ్చినతర్వాత విలాసవంతమైన జీవితానికి చాలామంది అలవాటుపడ్డారు. అప్పు చేసి ఖర్చు చేయడం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది.
4. ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఖర్చు చేయడం:
ఖర్చులకోసం డబ్బు తీస్తున్నప్పుడల్లా ఒకసారి ఆలోచించండి. ఇది నిజంగా అవసరమా?ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ అవసరం అనుకుంటేనే..ఖర్చు చేయండి. ఇలా చేయడం వల్ల అనవసరంగా ఖర్చు పెట్టే అలవాటు క్రమంగా తగ్గుతుంది. తెలివిగా ఖర్చు చేస్తే…పొదుపు చేయడంలో నిష్ణాతులు అవుతారు.