ఎరువుల ఉత్పత్తి సంస్థ ఇఫ్కో రైతులకు తీపి కబురు అందించింది. ఎరువుల ధరలను 14 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. అంతర్జాతీయంగా ఏర్పడ్డ ఆహార సంక్షోభ పరిస్థితులు, పెరిగిన ఎరువుల ధరలతో రైతులకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ అధికారులు వెల్లడిస్తున్నారు. తగ్గిన ధరలు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి అమలవుతుందని స్పష్టం చేశారు. కొత్త టెక్నాలజీతో నానో ఎరువుల తయారీ, ఉత్పత్తి భారీగా పెంచడంతో ఉత్పత్తి వ్యయం తగ్గిందని, ఆ ప్రయోజనాన్ని రైతులకు బదలాయిస్తున్నట్టు తెలిపారు.
అటు దేశంలో ఆహార భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం కూడా భారీగా సబ్సిడీలు ఇస్తోంది. ఎన్‌పీకే ఎరువులకు ఒక బస్తాకు రూ. 200 నుంచి రూ. 1200 వరకు సబ్సిడీ ఇస్తోందని, 2023-24 ఏడాదికి ఆ భారం రూ. 1.75 లక్షల కోట్లకు చేరనుందని ఓ అంచనా. అటు ఎరువుల దిగుమతులపై భారీగా డబ్బు ఖర్చుచేయాల్సి వస్తుండడంతో ఎరువుల శాఖ మంత్రి, విదేశాంగ మంత్రితో ఇప్పటికే భేటీ అయ్యారు. భారతీయ కంపెనీలు ఆఫ్రికా దేశాల్లో ఖనిజాలపై పెట్టుబడి పెట్టుందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.