బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మరోసారి వార్తల్లోకి వచ్చింది. గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (ఇఫి)లో ఈ సినిమాను ప్రదర్శించారు. దీనిపై ఇఫి జ్యూరీ హెడ్ నడవ్ లాపిడ్ ముగింపు వేడుకల్లో మాట్లాడుతూ.. కశ్మీరీ పండితుల వలసల మీద తీసిన ఈ సినిమా.. పరమ చెత్తగా వర్ణిస్తూ.. ‘వల్గర్’గా ఉందన్నారు. అదొక ‘ప్రాపగాండ మూవీ’ అని.. అలాంటి సినిమాను ఈ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించడం చూసి జ్యూరీలోని అందరూ షాక్ అయ్యారని చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఫిలిం ఫెస్టివల్లో పోటీ పడే అర్హత ఆ సినిమాకు లేదన్నారు. అందరి ఎదురుగా స్టేజీ మీద నిలబడి.. నిర్మొహమాటంగా, స్వేచ్ఛగా, తన అభిప్రాయన్ని తెలుపుతున్నందుకు తానెలాంటి ఇబ్బంది పడటం లేదన్నారు. భిన్న అభిప్రాయాలను వ్యక్త పరచడానికే ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్‌ను ఏర్పాటు చేస్తారని, జీవితంలోనైనా కళలోనైనా విమర్శ అనేది ఎంతో అవసరం’ నడవ్ లపిడ్ అన్నారు.
Chair of the Jury of Goa Film Festival says that the Jury felt that Kashmir Files was a vulgar propaganda film, inappropriate for the film festival pic.twitter.com/FKTF93ZlRY
— Prashant Bhushan (@pbhushan1) November 28, 2022
నడవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని ప్రముఖులు లపిడ్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ పై ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేసినందుకు నడవ్ లపిడ్ మీద చర్యలు తీసుకోవాలని బాలీవుడ్ ప్రొడ్యూసర్ అశోక్ పండిట్, కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్‌ను కోరారు. ‘మా విషాధ గాథను వల్గర్ గా అభివర్ణించిన ఐఎఫ్ఎఫ్ఐ-2022 జ్యూరీ చైర్మన్ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఒక కశ్మీరీ పండితునిగా, జాతి హననపు బాధితునిగా కోరుతున్నా’ అంటూ అశోక్ పండిట్ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో నటించిన ప్రముఖ నటుడు అనుపమ ఖేర్ మట్లాడుతూ.. ‘‘నాడు యూదులపై నరమేధం నిజమైతే.. కశ్మీరీ పండిట్ల ఊచకోత కూడా నిజమే. దేవుడు ఆయనకు తెలివిని ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని విమర్శించారు. అటు ఈ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా ట్విటర్లో స్పందించారు. ‘నిజం చాలా ప్రమాదకరమైనది. ఇది ప్రజలతో అబద్దాలు చెప్పించగలదు’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ విమర్శలపై ఇఫి జ్యూరీ బోర్డు స్పందిస్తూ… కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై లాపిడ్ చేసిన వ్యాఖ్యలు.. పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనని, దీనిపై జ్యూరీ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దర్శకుడి వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపడంతో భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి నావొర్ గిలాన్ స్పందించారు. లాపిడ్ వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు. ‘‘ఆతిథ్యమిచ్చిన దేశాన్నే అవమానించిన లాపిడ్ వ్యాఖ్యల పట్ల ఇజ్రాయెల్ దేశస్థుడిగా నేను సిగ్గుపడుతున్నానని, భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేస్తున్నా’’ అని గిలాన్ ట్విటర్లో పోస్టులు పెట్టారు.