టీచర్స్ డే స్పెషల్.. చదువంటే ప్రజలను తెలుసుకోవడమే.. చుక్కా రామయ్య
చుక్కా రామయ్య.. పరిచయం అక్కర్లేని పేరు. ఐఐటీ శిక్షణకు మారుపేరైన ఆయన జీవితంలో ఎన్నో ఆసక్తికర, స్ఫూర్తిదాయక కోణాలు ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొన్నటి ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు ప్రతి మలుపులోనూ ఉన్న రామయ్య తన అంతరంగాన్ని మైక్ టీవీ ప్రతినిధి సతీష్ కుమార్‌తో పంచుకున్నారు. వేలమంది విద్యార్థులకు బంగారు భవిత చూపించిన రామయ్య అంతరంగ ఆవిష్కరణ ఇది..
ఐఐటీ రామయ్యను ఎలా అయ్యానంటే..
నేను ఏ ఐఐటీలోనూ చదవలేదు. ఏ ఐఐటీలోనూ పని కూడా చేయలేదు. కానీ మా అమ్మాయి ఐఐటీ రాసింది. మద్రాస్ ఐఐటీ నిర్వహించిన ఇంటర్వ్యూకు పేరెంటుగా వెళ్లాను. 20 మంది తెలుగు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అంత తక్కువా అని బాధ అనిపించింది. అప్పటికే కాలేజీ ప్రిన్సిపాల్‌గా రిటైరై ఉన్నా. 20 ఏళ్లు డిగ్రీ కాలేజీ లెక్చరరుగా పనిచేసిన అనుభవం ఉంది. హైదరాబాద్‌ను కార్యరంగంగా ఎంచుకున్నాను. 1985 ప్రాంతం అది. ఫస్ట్ బ్యాచ్ 10 మందితో మొదలైంది. ఎవరూ సెలెక్ట్ కాలేదు. కానీ నిరుత్సాహపడలేదు. ఐఐటీ ప్రశ్నపత్రాలను తీవ్రంగా అధ్యయనం చేశాను. అందులో టెక్ట్స్ బుక్స్ నుంచి ప్రశ్నలు ఇవ్వరు, కానీ సిలబస్‌కు లోబడే ఉంటాయి. ఆ ప్రశ్నల తీరుపై చాలా కష్టపడి అధ్యయనం చేశాను. కిటుకు తెలిసింది. తర్వాత బ్యాచ్‌లో ఏడుగురు సెలెక్ట్ అయ్యారు. గీతాంజలి స్కూల్లో క్లాసులు ఏర్పాటు చేశాం. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 50 మాత్రమే ఫీజుగా చెల్లించేవారు. డబ్బు ముఖ్యం కాదు కదా.
మా విద్యార్థులను కొనడానికి వచ్చారు..
1990ల ప్రాంతంలో టెక్నాలజీ వచ్చింది. ఉద్యోగావకాశాలు పెరిగాయి. ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొచ్చాయి. చాలా మంది ఉద్యోగం కోసమే చదువుతారుగానీ, తెలివితేటల కోసం కాదు. ఐఐటీ చదివితే మంచి ఉద్యోగం వస్తుంది కనుక పోటీ మొదలైంది. మా సంస్థలో చేరాలంటే పరీక్ష పెట్టాలనుకున్నాం. కానీ తర్వాత ఐఐటీ ఎంట్రన్స్ పెద్దవ్యాపారంగా మారింది. మా సంస్థ ప్రగతిని చూసి చైతన్య విద్యాసంస్థల ప్రతినిధి వచ్చారు. మాలాంటి సంస్థను స్థాపించాలనుకున్నామని చెప్పారు. సాధ్యం కాదన్నాను. తర్వాత మా సంస్థలో చదువుకుని సెలెక్ట్ అయిన విద్యార్థులను కొనడానికి వచ్చారు.
మా ఊరు, మా అమ్మ పట్టుదల
నాటి నల్గొండ జిల్లాలో, ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్న గూడూరు మా ఊరు. దగ్గర్లోనే బమ్మెర, పాలకుర్తి సోమనాథ ఆలయం ఉన్నాయి. మా అమ్మ మా నాన్నకు రెండో భార్య. తొలి బిడ్డను కాబట్టి గారాబంగా పెంచారు. నాన్న నన్ను పౌరోహిత్యంలో ఉంచాలనుకున్నారు. కానీ అమ్మ చదివించాలనుకుంది. చదువుకుంటే ఊరిలోంచి వెళ్లిపోతాడని నాన్న అన్నారు. అమ్మ ప్రోద్బలం వల్ల చదువుకున్నాను.
చదువు, ఉద్యమం, ఉద్యోగం ఇలా సాగాయి..
మూడో తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నాను. నాకు ఏ సబ్జెక్టూ అర్థం కాకపోయేది. లెక్కలు మాత్రమే బాగా అర్థమయ్యేవి. ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ చదవడానికి ఉస్మానియా యూనివర్సిటీలో చేరాను. 1946 ప్రాంతం అది. కానీ నా మనసు ఊరిపైనే ఉండేది. ఒకపక్క తెలంగాణ సాయుధ పోరాటం సాగుతోంది. నాకు ఏడాది జైలు శిక్ష వేశారు. మరో కేసులో విచారణ సాగుతోంది. నేను ఉన్న బ్యారక్‌లోనే పీటీఐ వార్తాసంస్థ విలేకరి ఉండేవారు. ఏం చదువుకుని జైలు కొచ్చావు అని అడిగారు. నేను బీఎస్సీ అన్నాను. అదికాదు, జైలుకు రావాలంటే వేరే చదువు చదవాలన్నాడు. ప్రజలను తెలుసుకోవడమే చదువు అనుకున్నాను. ఆయన నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా, లెటర్స్ టు ఇందిగాంధీ, లోహియా మై విజన్ ఆఫ్ ఇండియా అవి.
దళితుల ఇళ్లలో తిన్నానని కులం నుంచి బహిష్కరించారు
నేను బ్రాహ్మణ భావజాలాన్ని విమర్శించాను. దళితుల ఇళ్లలో తిన్నాను. దీంతో నన్ను కులం నుంచి బహిష్కరించారు. మా అమ్మ బహిష్కరణను ప్రశ్నించింది. దళితుల ఇళ్లలో తినడం తప్పా? అని వెలేసిన బ్రాహ్మలను నిలదీసింది. ఇది నాలో మార్పు తెచ్చింది. నేను జైలు నుంచి ఇంటికొచ్చాక మా కుటుంబం చితికిపోయింది. ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. కులవ్యవస్థ అప్పట్లో దారుణంగా ఉండేది. దళితులు పొద్దున లేస్తూనే దొరలకు చాకిరీ చేయాలి. ధోవతీ మోకాళ్ల కిందికి జారకూడదు. ప్రతి వాక్యంలో బాంచన్ దొర అనాలి.
ఉద్యోగం ఆరు నెలలు మాత్రమే ఉంటుందన్నారు
జనగామలోని ఆంధ్ర భాషాభివర్ధిని సమాజంలో ఉద్యోగం దొరికింది. అయితే ఆరు నెలలు గడిచాక వెళ్లిపోవాలన్నారు. అక్కడ లెక్కలు బోధించాను. తర్వాత ప్రభుత్వ స్కూల్లో టీచర్ ఉద్యోగం లభించింది. అప్పుడే తెలుగు మీడియం వచ్చింది. 40 మందిలో 12 మందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. మాతృభాషలో విద్య వల్ల ఇది సాధ్యమైంది. కానీ భువనగిరి కాంగ్రెస్ నేతలు నన్ను ఉద్యోగం నుంచి తప్పించాలనుకున్నారు. టీచర్‌గా నేను మంచివాడినే కానీ, ఉద్యమకారుడినని వాళ్ల అభ్యంతరం. విచారణ జరిపించారు. నాలుగేళ్లు నిఘా నీడలో చదువు చెప్పాను. పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టాను.
కుటుంబం, ఆరోగ్యం
తెల్లవారుజామున నాలుగున్నరకే లేస్తాను. గంటన్నరపాటు వాకింగ్ చేస్తాను. నా భార్య నాకు పూర్తిగా సహకరించేది. ఇంటి బరువు బాధ్యతను తనే మోసేది. కానీ కాలానికి తగ్గట్లు మారిపోయింది. నేను పాటిస్తున్న విలువలను అనుసరించింది. నేను ఆస్తికుడినే. అయితే అదంతా నా సంస్కృతి వరకే పరిమితం. నా భావాలు ఆధునికం.
ఆశించిన తెలంగాణ వచ్చిందా?
తెలంగాణ వాదం కోసం ఎమ్మెల్సీ అయ్యాను. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ మద్దతిచ్చాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. కానీ, నేను అనుకున్న తెలంగాణ రాలేదు. మొదటి ఐదు సంవత్సరాల్లో మార్పు రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది.