పండగపూట రాముణ్ని తిట్టలేదు - MicTv.in - Telugu News
mictv telugu

పండగపూట రాముణ్ని తిట్టలేదు

October 21, 2017

దీపావళి రోజున తాను రాముణ్ని ధూషించినట్లు ఒక దిన పత్రికలో వచ్చిన వార్త పచ్చి అబద్ధమని ప్రొఫెసర్ కంచ ఐలయ్య శనివారం స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రచయితపై తప్పుడు ప్రచారం చేయడం కూడా మతతత్వ కుట్రేనని మండిపడ్డారు. ‘అమెరికా ప్రతినిధుల సభ సీనియర్ సభ్యుడు ట్రెంట్ ఫ్రాంక్స్ భారతదేశంలో వాక్ స్వాతంత్య్రం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైశ్యుల నేత టీజీ వెంకటేశ్ దీనిపై స్పందించారు. అమెరికా సంస్కృతిని, అమెరికన్ సెనెటర్‌ను తీవ్రంగా హెచ్చరించారు. ఆయన ఇలా హెచ్చరించడం వల్ల అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు ప్రమాదకర పరిస్థితులు కల్పించారు’ అని ఐలయ్య ఆందోళన వ్యక్తం చేశారు. మానవహక్కులకు గౌరవం ఇవ్వని దేశాల్లో అమెరికా పెట్టుబడులు పెట్టదని అన్నారు.

వెంకటేశ్ కే నష్టం

ఏపీ సీఎం చంబాబు నాయుడు  మూడు నెలలకోసారి అమెరికా వెళ్తుంటారని, ఆయన ఆర్థిక లక్ష్యాలకు కూడా టీజీ వెంకటేశ్ వ్యవహారశైలి వల్ల నష్టం కలుగుతుందని ఐలయ్య అన్నారు. తనను చంపడం వేస్ట్ అని వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలు ప్రమాదకరమైనవని, టైం వేస్టు కాకుండా చంపిన ఘటనలు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.  చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే టీజీ వెంకటేశ్‌ను వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫత్వాలు జారీచేసే వెంకటేశ్ హైదరాబాదులో ఉంటే అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ఈ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎలా మొగ్గుచూపుతుందని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలపై స్పందిస్తూ.. నారాయణ, చైతన్య కాలేజీలు మూసేయాలని, ఇంటర్మీడియట్ ను ఎత్తేయాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో  బహుజన ప్రతిఘటన వేదిక అధ్యక్షుడు ఉసా మాట్లాడుతూ.. విజయవాడ సభకు ఐలయ్య హాజరవుతారని,  ఆయనను అడ్డుకుంటామంటున్న బ్రహ్మణ, వైశ్య సంఘాల ప్రయత్నం అభాసు పాలౌతుందని అన్నారు. ఆ సంఘాలు ఐలయ్యపై దాడులు ప్రారంభిస్తే… దాడుల్ని ముగించే అవకాశం వారి చేతుల్లో ఉండదని హెచ్చరించారు. బీసీకి  రావాల్సిన రాజ్యసభ ఎంపీ సీటును టీజీ 100 కోట్లిచ్చి కొనుక్కున్నాడని ఆరోపించారు.