Illegal hotel of BJP leader and murder accused razed in MP
mictv telugu

60 డైనమైట్లతో మాజీ బీజేపీ నేత హోటల్ కూల్చివేత

January 4, 2023

Illegal hotel of BJP leader and murder accused razed in MP

మధ్యప్రదేశ్‌లో ఓ హత్య కేసు నిందితుడిగా ఉన్న మాజీ బీజేపీ నాయకుడి హోటల్ ను కూల్చేశారు అధికారులు. మిశ్రీ చాంద్ గుప్తా అనే ఆ బీజేపీ బహిష్కృత నేత.. తన హోటల్ ను అక్రమంగా నిర్మించడమే.. కూల్చడానికి ప్రధాన కారణం. గత నెల డిసెంబర్ 22న చంద్ర గుప్తా మరియు అతని కుటుంబ సభ్యులపై జగదీష్‌ యాదవ్‌ అనే వ్యక్తిని ఎస్‌యూవీతో ఢీకొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు ఈ కేసు విషయమై మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. అందులో ఐదుగురిని అరెస్టు చేయగా, చాంద్ గుప్తా పరారీలోనే ఉన్నారు.

పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురైన చాంద్ గుప్తాకు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలోనే ఆ హత్య కేసులో దర్యాప్తులో భాగంగా అతడి పేరిట ఉన్న హోటల్‌ అక్రమంగా కట్టిందని అధికారులు, జిల్లా యంత్రాంగం గుర్తించారు. దీంతో.. ఇండోర్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం చేత ప్యాలెస్‌ను జిల్లా యంత్రాంగం ధ్వంసం చేసింది. సుమారు 60 డైన‌మైట్ల‌ను పెట్టి హోట‌ల్‌ను పేల్చివేశారు. కొన్ని సెక‌న్ల తేడాలోనే ఆ బిల్డింగ్ నేల‌మ‌ట్టం అయ్యింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. సాగ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ దీప‌క్ ఆర్యా, డిఐజీ త‌రుణ్ నాయ‌క్‌, ఇత‌ర సీనియ‌ర్ అధికారులు ఆ కూల్చివేత ప్ర‌క్రియ‌ను వీక్షించారు.

కలెక్టర్‌ దీపక్‌ ఆర్య స్వయంగా కూల్చివేత ఏర్పాట్లను పర్యవేక్షించారు. కూల్చివేత సమయంలో హోటల్‌ కూడలి చుట్టూ బారికేడ్లు వేసి ట్రాఫిక్‌ను నిలిపేశారు. అలాగే హోటల్ చుట్టూ ఉన్న భవనాల్లో నివసించే ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఈ కూల్చివేత ఘటనలో ఎవరికీ, ఎలాంటి నష్టం జరగలేదని, కేవలం భవనం మాత్రమే కూలిందని కలెక్టర్‌ ప్రకటించారు.
మరో ముఖ్య విషయం ఏంటంటే హత్య చేయబడ్డ జగదీష్‌ యాదవ్‌ స్వతంత్ర కౌన్సిలర్‌ కిరణ్‌ యాదవ్‌కు మేనల్లుడు. కిరణ్‌ యాదవ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్ర గుప్తా భార్య మీనాను సుమారు 83 ఓట్ల ఆధిక్యంతో ఓడించడం గమనార్హం.