అత్తాపూర్ హత్య.. అక్రమ సంబంధమే కారణం - MicTv.in - Telugu News
mictv telugu

అత్తాపూర్ హత్య.. అక్రమ సంబంధమే కారణం

September 26, 2018

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌ పిల్లర్ నంబర్ 143 వద్ద జరిగిన దారుణహత్య వెనుక అక్రమ సంబంధమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. హతుడు రమేశ్ ఉప్పలపల్లి కోర్టుకు వెళ్లి వస్తుండగా నలుగురు దుండగులు దాడిచేసి గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడింది మహేశ్ కుటుంబీకులేనని తేలింది. మృతుడు గతంలో తన కొడుకును హత్య చేశాడని మహేష్ తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు.హంతకుడు మహేశ్ గౌడ్ తండ్రి గతంలో జుమ్మేరాత్ బజార్‌లో కిరాణా షాపు నడుపుకునేవాడు. అక్కడే ఉంటున్న రమేశ్‌కు వివాహిత మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ మహిళ మీద మహేశ్ కన్ను కూడా పడింది. ఆమెను తన కోరిక తీర్చాలని వేధించేవాడు. దీంతో ఆ మహిళ ఈ విషయాన్ని రమేశ్‌కు చెప్పింది. వెంటనే ఆ మహిళను వేధించడం ఆపేయాలని రమేశ్, మహేష్‌ను హెచ్చరించాడు. అయినా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోయింది. దీంతో అతణ్ణి ఎలాగైనా చంపెయ్యాలని నిర్ణయించుకున్నాడు రమేశ్.

గతేడాది పార్టీ వుందని రమేశ్, మహేశ్‌ను పిలిచాడు. శంషాబాద్ వరకు కారులో తీసుకువెళ్ళి స్నేహితుల సాయంతో గొంతుకోసి చంపేశారు. మృతదేహం ఆనవాళ్ళు గుర్తు పట్టకుండా పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రమేశ్‌ను నిందితుడిగా చేర్చారు.

ఇదే కేసు విచారణకు ఉప్పర్ పల్లి కోర్టుకు హాజరై తిరిగి వెళ్తున్న రమేశ్‌పై మహేశ్ తండ్రి హత్యకు పాల్పడ్డాడు. రమేశ్‌ను నరికిన తర్వాత మహేశ్ తండ్రి గాల్లోకి చేతులు ఊపుతూ ఆనంద పడ్డాడు.  అక్రమ సంబంధమే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు నిర్ధారించారు.