బిగ్‌బాస్ సీజన్ 4కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగవ్వ ఇంటినుంచి ఐదవవారం బయటకు వచ్చేశారు. దీంతో ఆమెను ఇష్టపడేవారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఆమె లేని బిగ్‌బాస్ చప్పగా ఉంది అని అంటున్నారు. గంగవ్వ ఇంట్లోకి వెళ్లిన రెండో వారమే తనకు ఆ ఇంట్లో పొసగడం లేదని, ఆరోగ్యం సహకరించడంలేదని తన ఇంటికి పంపమని కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. అప్పుడు బిగ్‌బాస్ ఓవైపు, నాగార్జున ఓవైపు ఆమెను సముదాయించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమె త్వరగా కోలుకునేలా చూసుకున్నారు. తన ఆరోగ్యం బాగుపడ్డాక గంగవ్వ కూడా తన ఇంటికి వెళ్లనని చెప్పారు. అయితే ఐదో వారం వచ్చేసరికి గంగవ్వ మళ్లీ అదే పాట అందుకున్నారు. తనకు ముద్ద మింగుడు పడటంలేదని, ఇంటికి పంపించండని వేడుకుంది. వైద్య పరీక్షలు చేసి అనారోగ్యం కారణంగా గంగవ్వను స్వచ్ఛందంగా ఇంట్లోంచి బయటకు పంపారు. అయితే గంగవ్వ ఇంట్లోంచి బయటకు వెళ్లడానికి కారణం ఆమె అనారోగ్యం కాదని తెలుస్తోంది.
రెండో వారం గంగవ్వ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తే టీఆర్పీ రేటింగ్‌పై తీవ్ర ప్రభావం పడేదని భావించిన బిగ్‌బాస్ నిర్వాహకులు బతిమిలాడి బామాలి ఆమెను ఇంట్లో ఉండేలా చేశారు. మరి ఐదో వారానికి అలా ఎందుకు చెయ్యలేకపోయారు. ఆమె ఇంటి సభ్యులను తీసుకువచ్చి మాట్లాడించినా గంగవ్వ కుదుటపడేది కదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఈసారి మాత్రం గంగవ్వ మాటను కాదనకుండా బయటకు పంపించేశారు. మొత్తానికి గంగవ్వ తనంతట తానుగా ఇంట్లోంచి బయటకు వచ్చి తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకున్నారు. రెండో వారం బిగ్‌బాస్ పరిస్థితి చూస్తే.. గంగవ్వ తప్పితే ఇంట్లో ఏమీ లేదు. కెమెరాలు అన్నీ ఆమెనే ఫోకస్ చేసేవి. గంగవ్వకు ఉన్నంత ఫాలోయింగ్ వారిలో ఎవరికీ లేదనేది తెలిసిన విషయమే. దానిని బిగ్‌బాస్ వాడుకున్నాడు. ఆమె తొలివారంలో నామినేషన్లో ఉన్నా కోట్ల ఓట్లు పడ్డాయి. కెప్టెన్ టాస్క్‌లో సరిగా పార్టిసిపేట్ చేయకపోయినా.. గంగవ్వను కెప్టెన్‌ని చేయడం.. ఫ్యాషన్ షోలో కూడా గంగవ్వనే విజేతగా ప్రకటించం లాంటివి.. గంగవ్వను తన ఆట తనను ఆడకుండా చేశాయి. ఇలా ఉపాయం ప్రకారం ఐదోవారానికి వచ్చే సరికి గంగవ్వ ఇంట్లో ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్టుగా పరిస్థితిని తీసుకువచ్చారు. మోనాల్, అఖిల్, అభిజిత్‌ల ట్రయాంగిల్ మీద ఫోకస్ పెట్టాడు బిగ్‌బాస్. గంగవ్వను స్పెషల్‌గా ట్రీట్ చేయడంపై బాగా విమర్శలు వచ్చాయి. ఆమె ఇంట్లో ఉంటే ఆట డిస్ట్రబ్ అవుతుందని.. ఆమె పార్టిసిపేట్ చేయడం కూడా తక్కువే కావడంతో ఐదోవారంలో గంగవ్వను పంపించే ప్రణాళికను సిద్ధం చేశారు. మొత్తానికి బిగ్‌బాస్‌లో పైన కినిపించేది ఒకటి లోన కనిపించేది మరొకటిలా ఉంది.