నేను రాక్షసులతో, రక్త పిశాచులతో పోరాడుతున్నా: జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

నేను రాక్షసులతో, రక్త పిశాచులతో పోరాడుతున్నా: జగన్

April 7, 2022

‘ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రస్తుతం నేను మారీచులతో, రాక్షసులతో, రక్తపిశాచులతో పోరాటం చేస్తున్నా’ అని జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో గ్రామ, వార్డు వాలంటీర్ల సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నా. దెయ్యాలు, రక్త పిశాచుల మాదిరిగా ప్రతిపక్షం, దాని మద్దతు పార్టీలు, అనుబంధ మీడియాలు వ్యవహరిస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ నాకు క్లాస్‌ పీకారంటూ కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. ఆ మీడియాగానీ, దానికి అనుబంధంగా ఉన్న వాళ్లు ఎవరైనాగానీ ఆ టైంలో సోఫాల కింద గానీ దాక్కున్నారా?. భవిష్యత్‌లో ఎవరూ ఓటు వేయరన్న భయమే ప్రతిపక్ష నాయకులతో అలాంటి పనులు చేయిస్తోంది” అని జగన్ ఎద్దేవా చేశారు.

అంతేకాకుండా ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోని దుర్మార్గులు.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న తమ ప్రభుత్వాన్ని విమర్శించడం చోద్యంగా ఉందని జగన్ విమర్శించారు. మంచి పరిపాలన అందిస్తుంటే మరో శ్రీలంక అవుతుందని కామెంట్లు చేస్తున్నారని, మరి వాళ్లలా వెన్నుపోట్లు పొడిస్తే అమెరికా అవుతుందా? అని ప్రశ్నించారు. గత చంద్రబాబు ప్రభుత్వం కన్నా కనివినీ ఎరుగని రేంజ్‌లో సేవ అందిస్తున్నామని, నచ్చితే అభిమానించడని, నచ్చకపోతే తనను ద్వేషించడని రాష్ట్ర ప్రజలను జగన్‌ కోరారు. ఎల్లో పార్టీ, అనుబంధ మీడియా, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు చెప్పే మాటల్ని మాత్రం నమ్మనే నమ్మొద్దని జగన్ ప్రజలను కోరారు.