Im going to win as an MLA in Munugode, says Prajashanti Party President KA Paul
mictv telugu

మునుగోడులో నేనే గెలుస్తా.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా: కేఏ పాల్

November 2, 2022

మునుగోడు ఉపఎన్నికలో తాను 50వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవబోతున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌ తెలిపారు. మునుగోడులో తన ప్రచారం చూసి 2 వందల దేశాల నేతలు ఆశ్చర్యపోతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్‌కు డిపాజిట్లు దక్కవని అన్నారు. మంగళవారం చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలివైన మునుగోడు ప్రజలు తనకే అండగా ఉన్నారని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్‌లో మాదిరిగా ఇక్కడ కూడా ప్రజలు ప్రధాన పార్టీలను ఓడిస్తారని తెలిపారు.

ఇక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మునుగోడుకు తాను చేయబోయే పనులు గురించి వివరించారు. ఎమ్మెల్యేగా గెలిచాక ఆరు నెలల్లో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానన్నారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు మునుగోడుకు కూడా ప్రపంచ స్థాయి కంపెనీలు తీసుకొస్తానని, హైదరాబాద్ లాగే అభివృద్ధి చేస్తానని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100–112 సీట్లను సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఎమ్మెల్యేగా తాను విజయం సాధిస్తున్నానని తెలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన బహిరంగ సభను రద్దు చేసుకున్నాడని తెలిపారు. రెడ్డి సామాజిక వర్గానికి సీఎం కేసీఆర్‌ చేసిందేమీ లేదని, ఆ సామాజిక వర్గం టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయొద్దన్నారు. వారంతా తనకే మద్దతుగా ఉన్నారని తెలిపారు.