తెలుగు చిత్రసీమ పరిశ్రమలో నటి కవిత అంటే తెలియని వారుండరు. ‘సిరిసిరిమువ్వ’తో ఆమె టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఆరోజు నుంచి ఈరోజు వరకు తమిళం, కన్నడ, మలయాళ వంటి భాషలలో 350కి పైగా సినిమాల్లో నటించారు. అలాంటి కవిత గురించి మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఆమె చనిపోయింది అంటూ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలను చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాను బతికి ఉండగానే ఇలాంటి వీడియోలు ఎవరు చేస్తున్నారని సోషల్ మీడియాపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
నటి కవిత మాట్లాడుతూ..” నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఇలాంటి ఫేక్ న్యూస్లు నమ్మకండి అని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. నేను చనిపోయానంటూ యూట్యూబ్లో కొందరు వీడియోలు పెడుతున్నారు. అవి చూసి నా స్నేహితులు, నా బంధువులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే ఆ వీడియోలు డిలీట్ చేయండి. లేకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుంది’ అని ఆమె యూట్యూబ్ ఛానెళ్లను హెచ్చరించింది.
కవిత పశ్చిమగోదావరి జిల్లా, నిడమర్రులో జన్మించారు. సినిమాల మీద ఇష్టంతో ఆమె తమిళంలో ‘ఓ మంజు’ అనే సినిమాలో కథనాయికగా నటించారు. ప్రస్తుతం తెలుగులో వెండితెరతోపాటు బుల్లితెరపై కూడా నటిస్తున్నారు.