‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో విశ్వక్సేన్ తాజాగా చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణలు కోరారు. ‘సినిమా ప్రచారంలో భాగంగానే ఆ ప్రాంక్ వీడియో చేశాను తప్ప, ప్రజలకు ఇబ్బంది కల్గించాలని కాదు’ అని అన్నారు. మంగళవారం జరిగిన ఓ ప్రెస్మీట్లో విశ్వక్సేన్ మాట్లాడుతూ..”నేను చేసిన పనులకు మీడియా ముఖంగా సారీ చెప్తున్నా. ప్రాంక్ వీడియోను కేవలం ప్రమోషన్స్ కోసమే చేశాం. అన్ని ప్రాంక్ వీడియోలతో దీన్ని పోల్చకండి. ఇక, టీవీ ఛానెల్లో యాంకర్‌పై అరవడం నా తప్పే, కానీ నేను కావాలని ఆ పదాన్ని అనలేదు. కోపంలో సహనం కోల్పోయి, నా నోటి నుంచి ఆ మాట వచ్చింది. అందుకు క్షమాపణలు కోరుతున్నాను. దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని ఎంత వేగంగా వస్తుందో, కోపంలో ఉన్నా నాకు ఆ పదం అలానే వచ్చేసింది. ఏది ఏమైనా మీడియా ముందు ఆ పదం వాడినందుకు ఐయామ్ వెరీ సారీ” అని అన్నారు.
మరోపక్క విశ్వక్సేన్పై సోమవారం హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రముఖ టీవీ ఛానెల్ యాంకర్ దేవీ నాగవల్లి ప్రాంక్ వీడియోపై డిబేట్ నిర్వహించి, విశ్వక్సేన్ను ప్రశ్నిస్తుండగా, వాగ్వాదం జరిగి లైవ్‌లోనే తిట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన విశ్వక్సేన్ ఈరోజు మీడియా ముందు క్షమాపణలు కోరారు.