IMD forecasts extreme rainfall in Telangana for July 8 and 9; red alert issued
mictv telugu

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

July 8, 2022

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈ రోజు ఉద‌యం నుంచి వానజల్లు కురుస్తోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాబోయే మూడు రోజుల పాటు హైద‌రాబాద్ న‌గ‌రానికి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఈ మూడు రోజుల్లో హైద‌రాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. గడిచిన 24గంటల్లో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. రెండు రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌, ఆ తరువాత రెండు రోజులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశామని వెల్లడించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణం కన్నా 45శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని వివరించారు.

రాష్ట్రంలోని 14 జిల్లాల‌కు కూడా భారీ వ‌ర్ష సూచ‌న చేసింది వాతావ‌ర‌ణ శాఖ‌. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లి వెళ్లాల‌ని సూచించింది. అవ‌స‌ర‌మైతేనే ప్ర‌జ‌లు ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని చెప్పింది. ఇప్ప‌టికే కురిసిన భారీ వ‌ర్షాల‌కు రాష్ట్రంలోని అన్ని జ‌లాశ‌యాల‌కు జ‌ల‌క‌ళ వ‌చ్చింది. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. రైతులు కూడా పొలాల బాట ప‌ట్టి, వ్య‌వ‌సాయ ప‌నుల్లో నిమ‌గ్న‌మైపోయారు.