విదేశీ మారక ద్రవ్యం క్షీణతతో ఆర్ధిక సంక్షోభం దిశగా వెళ్తున్న పాకిస్తాన్ రుణం కోసం ఐఎంఎఫ్ వద్ద దేబిరిస్తోంది. రుణం కావాలంటే తాము చెప్పినట్టు నడుచుకోవాలని చెప్పిన ఐఎంఎఫ్.. ఆ నిబంధనలను పాటిస్తున్నప్పటికీ రుణం మాత్రం మంజూరు చేయడం లేదని అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనావుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ‘దేశ భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. ఆర్ధిక వ్యవస్థ విషయంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. వీటి నుంచి గట్టెక్కడానికి తమకు ప్రతికూలంగా ఉన్నా ఐఎంఎఫ్ నిబంధనలను పాటించాం. ఒక మాటలో చెప్పాలంటే వారు ఆడించినట్టు ఆడాం. అయినా నిధులు మంజూరు చేయడం లేదు. గత ప్రభుత్వం ఇలాంటి విషయాలు గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాలు చేసింది’ అని అభిప్రాయపడ్డారు. కాగా, రుణం కోసం ఐఎంఎఫ్ మొత్తం 26 షరతులు పెట్టగా, వాటిలో పాకిస్తాన్ 25 షరతులను పాటించింది. అయితే ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వారికి ప్రోత్సాహకాలు నిలిపివేయాలన్న షరతును మాత్రం అమలు చేయలేదు. దీంతో రుణం రావడం ఆలస్యమవుతోంది. అదీకాక, రుణం రాకుండా భారత్ అడ్డుపడుతోందని విమర్శిస్తోంది. ఈ ఐఎంఎఫ్‌లో అమెరికా, జపాన్ దేశాల వాటా సగం కంటే ఎక్కువ. పరోక్షంగా వారు ఒకే అంటేనే పాకిస్థాన్‌కు రుణం వస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.