ఆర్ధికవ్యవస్థ దారుణంగా పతనమైన పాకిస్తాన్ దేశానికి సహకరించేందుకు ఏ దేశం ముందుకు రావడం లేదు. తాజాగా ఆ దేశం ఎన్నో ఆశలు పెట్టుకున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పాకిస్తాన్కి షాక్ ఇచ్చింది. తమ దేశంలో సమీక్షను పూర్తి చేయడానికి సహాయక బృందాన్ని పంపాలని పాక్ చేసిన అభ్యర్ధనను తోసి పుచ్చింది. దీంతో పాకిస్తాన్కి గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. అధిక ద్రవ్యోల్బణం, ఆహార కొరతతో కొట్టుమిట్టాడుతున్న పాక్ వద్ద విదేశీ మారక నిల్వలు అత్యంత దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు ఆ దేశం వద్ద కేవలం 4.343 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా, ఇవి రెండు వారాల అవసరాలకు సరిపోతాయి.
ముఖ్యంగా చమురు దిగుమతులకు ఈ నిధులు వెచ్చించినా మిగతా అవసరాలు, రెండు వారాల తర్వాత పరిస్థితి ఏంటన్నది ఆందోళనకరంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఖర్చులు తగ్గించుకునేందుకు తనదైన శైలిలో కొన్ని చర్యలు చేపట్టిన పాకిస్తాన్.. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో పది శాతం కోత విధించేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. అలాగే మంత్రుల శాఖల్లో ఖర్చులు తగ్గించడం అవసరమైతే కొన్ని మంత్రి పదవులను రద్దు చేయడానికి కూడా ఆలోచిస్తోందని తెలుస్తోంది. కాగా, ఆర్ధికంగా అవలంబించిన అస్థవ్యస్థ విధానాలు, సైన్యానికి భారీ బడ్జెట్ కేటాయింపు, జమీందారీ వ్యవస్థ వంటి సమస్యలు ఆ దేశాన్ని దీర్ఘకాలంగా పట్టి పీడిస్తున్నాయి. దీనికి తోడు కొన్ని నెలల ముందు విపరీతమైన వరద రావడంతో వ్యవసాయం దెబ్బతిని తిండి గింజలకు కరువు ఏర్పడింది. గోధుమ పిండి కోసం ప్రజలు కొట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆ దేశంపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.