తెలంగాణలో..బకెట్ విధానం అమలు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో..బకెట్ విధానం అమలు

May 30, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశపెట్టిన విధంగానే ఇంటర్మీడియట్ కోర్సుల్లో కూడా బకెట్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఒక కోర్సు చదువుతూనే, మరో కోర్సులోని సబ్జెక్టులను ఎంచుకోవడానికి ఈ బకెట్ విధానం ఉపయోగపడుతుంది. హెచ్‌ఈసీ, సీఈసీ కోర్సుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే అంశంపై ఇటీవలే అధికారులు సమావేశం ఏర్పాటు చేసి, పలు విషయాలపై చర్చలు జరిపారు.

అధికారులు మాట్లాడుతూ..”మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్పులు చేయాలని నిర్ణయించాం. ఇంటర్మీడియట్ బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించాం. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, ఇంటర్‌లో హెచ్‌ఈసీ, సీఈసీ కోర్సులు చదివే విద్యార్థులు వాటిలో కొన్ని సబ్జెక్టులకు బదులుగా కంప్యూటర్ సైన్స్, ఏఐ, డేటా సైన్స్ వంటి సబ్జెక్టులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఉదాహరణకు.. ఇప్పటివరకు సీఈసీలో కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులు ఉండేవి. ఇకపై సివిక్స్ బదులుగా కంప్యూటర్ సైన్సను ఎంచుకునే అవకాశాన్ని విద్యార్దులకు ఇచ్చాం. ఇలా మరికొన్ని కొత్త కాంబినేషన్లను కూడా అమలు చేయనున్నాం. ఇందు కోసం రెండు విభాగాల్లో ఆరు కొత్త సబ్జెక్టులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరాం.” అని అన్నారు.

మరోపక్క ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను జూన్ 12 నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. జూన్ 20 నాటికి ఫలితాలను ప్రకటించే ప్రయత్నాల్లో ఉన్నారు. జూన్ 15న జూనియర్ కాలేజీలను పున: ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. 15 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులను ప్రారంభించనున్నారు. ప్రథమ సంవత్స రం తరగతులను మాత్రం జూలై 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.