ఇసుక అక్రమ రవాణా కేసులో తొలి శిక్ష అమలు..  - MicTv.in - Telugu News
mictv telugu

ఇసుక అక్రమ రవాణా కేసులో తొలి శిక్ష అమలు.. 

November 23, 2019

Implementation of first conviction in sand trafficking case.

ఏపీలో ఇసుక అక్రమ రవాణ కేసులో మొదటి శిక్ష అమలైంది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లెకు చెందిన వ్యక్తికి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల రూపాయల జరిమానా విధించింది. గ్రామ సమీపంలోని పాపాగ్ని నది నుంచి జులై 15న అనుమతులు లేకుండా ట్రాక్టర్‌లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న  ఎస్సై భక్తవత్సలం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గోపరాజుపల్లెకు చెందిన నిందితుడు నంద్యాల సుబ్బారాయుడిపై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన రెండో అదనపు జిల్లా మెజిస్ట్రేట్ నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. దీంతో ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన ఇసుక ఇష్యూలో తొలి శిక్షగా అమలవడం విశేషం. 

పైగా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలోనే ఈ శిక్ష అమలవడం గమనార్హం. కాగా, ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే క్షమించేదిలేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇసుక అక్రమంగా రవాణా చేస్తే వారికి రెండేళ్లు జైలుశిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇసుక అవినీతిని ప్రజలు ప్రభత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు 14500 టోల్ ఫ్రీ నంబరును కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.