Implementation of 'Impact Fee' in AP.. More lakhs to be paid..
mictv telugu

ఏపీలో ‘ఇంపాక్ట్ ఫీజు’ అమలు..ఇకపై లక్షలు చెల్లించాల్సిందే..

August 12, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ‘ఇంపాక్ట్ ఫీజు’ను అమలు చేస్తూ, గురువారం సాయంత్రం పురపాలక శాఖ అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో 60 అడుగులు, అంతకంటే ఎక్కువ వెడల్పున్న రహదారుల పక్కన కొత్తగా భవనాలు గానీ, ఇళ్లు కానీ నిర్మించాలంటే లక్షల్లో ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

”ప్రస్తుతం అమల్లో ఉన్న లైసెన్స్ ఫీజులు, ఇతర చార్జీలకు అదనంగా ఇకపై ‘ఇంపాక్ట్ ఫీజు’ను కూడా చెల్లించుకోవాలి. ఇప్పటికే ఉన్న రహదారులతోపాటు నిర్మాణంలో ఉన్న రహదారులు, కొత్తగా రహదారుల నిర్మాణానికి భూసేకరణ దశలో ఉన్న చోట కూడా ఈ ఫీజు కట్టాల్సిందే. 60 అడుగులు, ఆపైన..150 అడుగులు వెడల్పున్న రహదారుల్ని ఆనుకుని నిర్మించే పారిశ్రామికేతర వాణిజ్య భవనాలకూ ఇది వర్తిస్తుంది. 150 అడుగులు, అంతకుమించి వెడల్పు ఉన్న రహదారులకు రెండు పక్కలా 250 మీటర్ల దూరం వరకు నిర్మించే అన్ని రకాల భవనాలకు ఈ ఇంపాక్ట్ ఫీజు చెల్లించాల్సిందే. బిల్డప్ ఏరియాలో ప్రతీ చదరపు అడుగుకు ఇంత మొత్తమని నిర్ణయించాం. దీనిని అక్కడి స్థలం రిజిస్ట్రేషన్ విలువలో రెండు నుంచి మూడుశాతం కానీ, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దానిని వసూలు చేస్తాం” అని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అధికారులు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం..విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు నగరాల్లో 150 అడుగులకంటే ఎక్కువ వెడల్పున్న రహదారి పక్కనే 500 చ.మీ.లకంటే ఎక్కువ విస్తీర్ణమున్న స్థలంలో రెండు వేల చదరపు అడుగుల వాణిజ్య భవనం నిర్మించాలనుకుంటే…ఇక మీదట ఇంపాక్ట్ ఫీజు రూపంలోనే రూ. 3 లక్షలు చెల్లించాలి అన్నమాట. (చ. అడుగుకి రూ. 150 చొప్పున నిర్ణయించిన ఫీజు పరిగణనలోకి తీసుకుంటే). అయితే, ఈ ఇంపాక్ట్ పేరుతో వసూలు చేసిన డబ్బుతో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల విస్తరణ, లింక్‌రోడ్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ది, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతామని అధికారులు వెల్లడించారు.