కశ్మీరీలూ.. భారత్‌పై ఆయుధాలతో తిరగబడండి: ఇమ్రాన్
దాయాది మళ్లీ విషం చిమ్మాడు. హింసామంత్రాన్ని వల్లెవేశాడు. కశ్మీరీలు తిరగబడి భారత ప్రభుత్వంపై ఆయుధాలు ఎక్కుపెట్టాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చాడు. తాను కశ్మీర్‌కు అంబాసిడర్‌గా మారి ప్రపంచమంతా ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చాడు.
ఇమ్రాన్ ఈ రోజు పీఓకేలోని ముజఫరాబాద్‌లో కశ్మీరీలకు సంఘీభావంగా నిర్వహించిన ర్యాలీలో ఈ కారుకూతలు కూశాడు. ‘భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీరీలు ఆయుధాలు పట్టుకుని పోరాడాలి. నేను కశ్మీర్ రాయబారిగా బాసటగా ఉంటాను. నేను మీ సమస్యపై పనిచేస్తున్నాను. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో మీకు నిరాశ కలిగించను. మీరు ధైర్యంగా ఉండడి. కశ్మీర్‌లో భారత సైనికులు హింసకు పాల్పడినా ఫలితం ఉండదు. దానికి మేం తగిన రీతిలో బదులిస్తాం. కశ్మీర్ ప్రజలు భారత్‌ను వ్యతిరేకించాలి. బీజేపీ-ఆరెస్సెస్ సారథ్యంలో ప్రభుత్వంపై ఆయుధాలతో తిరగబడాలి. కశ్మీరీలు అమాయకులు. మోదీ వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు’ అని నోరు పారేసుకున్నాడు.
పుల్వామా ఉగ్రవాదిపైనా నోటికొచ్చినట్లు పేలాడు. భారత సైన్యం వేధింపులతో విసిగిపోయిన ఓ కశ్మీర్ యువకుడు పుల్వామాలో సైన్యంపై ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డాడని చెప్పాడు. అయితే భారత్ ఈ దాడికి తమను నిందించిందని, బాలాకోట్‌లో బాంబుదాడులు చేసిందని ఆరోపించాడు. ఇన్ని జరిగినా తాము భారత్‌తో యుద్ధాన్ని కోరుకోలేదని, ఆ దేశ పైలెట్ దొరికితే తిరిగి అప్పగించామని అభినందన్ వ్యవహారాన్ని గుర్తు చేశాడు.