పాక్‌లో రేప్‌లకు కారణం బాలీవుడ్డే.. ఇమ్రాన్ - MicTv.in - Telugu News
mictv telugu

పాక్‌లో రేప్‌లకు కారణం బాలీవుడ్డే.. ఇమ్రాన్

January 21, 2020

Imran Khan.

భారత్  – పాక్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడల్లా… బాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేయడం దాయాది దేశానికి రివాజుగా మారింది. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ బాలీవుడ్ సినిమాల ప్రదర్శనపై నిషేధం విధించి తమ కుటిల బుద్ధిని బయటపెట్టారు. తాజాగా మరోసారి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ సినిమాలపై విషం కక్కే ప్రయత్నం చేశారు. వారి దేశంలో అత్యాచారం, డ్రగ్స్ కేసులకు బాలీవుడ్ సినిమాలే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 పాఠశాలల్లో డ్రగ్స్ సమస్యపై జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ‘బాలీవుడ్ సినిమాల వల్లే అత్యాచార కేసులు పెరిగిపోతున్నాయి. పిల్లలపై లైంగిక వేధింపులకు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలే కారణం. వీటితో పాటు మొబైల్ ఫోన్లు కూడా పెద్ద తలనొప్పిగా మారాయి. వీటి ద్వారా వారు పెడదారి పడుతున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. అత్యాచార ఘటనలకు సినిమాలు కారణం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ప్రధాని స్థాయిలో ఉండి బాలీవుడ్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు.