ఇమ్రాన్ ఖాన్ రాజీనామా! - MicTv.in - Telugu News
mictv telugu

ఇమ్రాన్ ఖాన్ రాజీనామా!

March 28, 2022

 immm

పాకిస్తాన్‌లో రాజ‌కీయ అస్థిర‌త, సంక్షోభం దిశ‌గా అడుగులు ప‌డుతున్న ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ విదేశాల నుంచి అక్ర‌మ మార్గంలో పెద్ద ఎత్తున విరాళాలు పొందుతున్నార‌నే ఆరోప‌ణ‌లు గట్టిగా వినిపిస్తుండంతో ప్ర‌భుత్వం ప‌డిపోయే స్థాయికి చేరింది. అంతేకాకుండా ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో పాటు, సొంత పార్టీ నాయ‌కులు సైతం ఇమ్రాన్ ఖాన్‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతున్నారు. ఆయ‌న‌ను ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డంతో పాటు, అరెస్టు చేసే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయ‌ని పాకిస్తాన్ రాజ‌కీయ నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం ప్రతిపక్ష నాయకుడు షాబాజ్ షరీఫ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని స్వీకరించడంపై డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి సభలో ఓటింగ్ జరిపారు. ఈ ఓటింగ్‌లో భాగంగా 161 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారని, కాబట్టి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఎంపీల సంఖ్య 342. సభలో తమకు బలం ఉందని నిరూపించుకోవాలంటే, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి 172 మంది ఎంపీల మద్దతు అవసరం. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పీటీఐ పార్టీకి ఉన్న ఎంపీలు 155 మంది. మిత్రపక్షాల సహకారంతో ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని మీడియా సంస్థలు తెలిపాయి.

మరోపక్క పార్ల‌మెంటు ముందుకు వ‌చ్చిన అవిశ్వాస తీర్మానంపై ఈనెల 31న చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. అయితే, ఆ తీర్మానం చ‌ర్చ‌కు వ‌చ్చేలోగానే ఇమ్రాన్ ఖాన్ త‌న ప్రధాని ప‌ద‌వికి రాజీనామా చేసే అవ‌కాశాలు ఉన్నట్లు పాకిస్తాన్‌లో వార్త‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఓ వైపు విపక్షాల‌తో పాటుగా, త‌న సొంత పార్టీకి చెందిన ప‌లువురు ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసేందుకు సిద్ధ‌మ‌వడం ఇమ్రాన్ ఖాన్‌కు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌లోని ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు మాత్రం ఇమ్రాన్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.