అవకాశం దొరికినప్పుడల్లా తగుదునమ్మా అంటూ భారత్‌పై విషం చిమ్మాలని పాకిస్తాన్ చూస్తోంది. అలాకాకుండా తన గురించి తాను పట్టించకుంటే ఆదేశం ఎప్పుడో పురోగతి సాధించేదేమో. ఈమధ్య పదేపదే కశ్మీర్ సమస్యను లేవనెత్తుతూ దెప్పి పొడుస్తున్న పాక్‌లో అప్పులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. పాక్‌లో తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొనగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉన్న అప్పులు కట్టకపోగా అందినచోటల్లా అప్పులు చేస్తున్నారు. ఆర్ధిక సాయం కోసం ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ అప్పులకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఓ నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించింది. దేశం అప్పుల కుప్పగా తయారైనట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ మేరకు పాకిస్తాన్ మీడియా దేశ ఆర్థిక పరిస్థితిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ డేటా ప్రకారం కొన్ని కథనాలు రాసింది.
ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపే దాదాపు రూ. 7 లక్షల కోట్లు (పాక్ కరెన్సీ) రుణంగా తీసుకుంది. ఆగస్టు 2018 నుంచి ఆగస్టు 2019 వరకు విదేశీ వనరుల ద్వారా రూ.2,80,400 కోట్లు అప్పుగా పొందింది. మరో రూ.4,70,500 కోట్లు స్వదేశీ వనరుల ద్వారా తీసుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇంతకుముందెన్నడూ ఏడాదిలోపే ఈ స్థాయిలో రుణం తీసుకోలేదు. ఈ స్థాయిలో రుణాలు తీసుకోవడం రికార్డే. ప్రస్తుతం ప్రభుత్వ రుణం రూ.32,24,000 కోట్లకు చేరుకుంది.
ఇమ్రాన్ అధికారంలోకి రాకముందు పాకిస్తాన్ రూ.24,73,200 కోట్లు అప్పు ఉండేది. ప్రస్తుత తొలి ఆర్థిక త్రైమాసికానికి పాకిస్తాన్ రూ.1 లక్ష కోట్ల మేర పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.96,000 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. సౌదీ అరేబియా, చైనా తదితర దేశాలు పాకిస్తాన్‌ను బెయిలవుట్ ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ.. పాక్ ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడలేదు. ఈ ఏడాది జూన్‌లో ఖతార్ నుంచి పాకిస్తాన్ 3 ట్రిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజి అందుకుంది. అంతకుముందు యూఏఈ కూడా 2 ట్రిలియన్ డాలర్ల మేర సొమ్ములు సమకూర్చింది. మరోవైపు తమ ఆర్ధిక వ్యవస్థను సంక్షోభం నుంచి గాడిలో పెట్టేందుకు పాక్ ప్రభుత్వం 6 బిలియన్ డాలర్ల ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద ప్రాథమిక ఒప్పందం చేసుకోవడం గమనార్హం.