దేశ చరిత్రలోనే తొలిసారి.. సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం
భారత సుప్రీంకోర్టు చరిత్రలో కీలక పరిణామం చోటుచేసకుంది. 71 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో ఇవాళ తొలిసారిగా కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 26న సుప్రీంకోర్టు లైవ్ ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష ప్రసారానికి జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఈ రోజు ఎన్వీ రమణ పదవీ విమరణ చేయనున్న నేపథ్యంలో.. అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, విచారణలో భాగంగా ఉచిత పథకాలపై దాఖలైన పిటిషిన్లపై సీజేఐ తీర్పు వెల్లడించారు. ఉచిత హామీలపై పిటిషన్లను ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేస్తూ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ నిర్ణయం తీసుకుంది. 2013 నాటి తీర్పు పునః పరిశీలనకు కోర్టు ఆమోదం తెలిపింది.
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ.. విశేష సేవలు అందించారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. 2021 ఏప్రిల్ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు.
కాగా, రేపు 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు. రాష్ట్రపతి భవన్‍లో జస్టిస్ యూయూ లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక, యూయూ లలిత్ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది.