దసరా సామరస్యం.. హిందూ ముస్లింలు కలిసి దుర్గాపూజ - MicTv.in - Telugu News
mictv telugu

దసరా సామరస్యం.. హిందూ ముస్లింలు కలిసి దుర్గాపూజ

October 25, 2020

ammoru

ఎన్నో మతాల వారు ఇక్కడ కలిసి ఉన్నారు. ఐకమత్యంగా ఉంటారు, అన్యోన్యంగా పలకరించుకుంటారు. అదే మన అందమైన భారతదేశం. హిందూ ముస్లిం భాయిభాయి అని తరతరాలుగా ఆ మాటకు కట్టుబడి ఉంటున్నాం. కలిసి పండగలను సెలబ్రేట్ చేసుకుంటాం. అలాంటి భారతీయుల ఐక్యతను చాటిచెప్పే ఓ సంఘటన జరిగింది. 

త్రిపుర రాజధాని అగర్తాలలోని ఓ స్లమ్‌లో నివసిస్తున్న ప్రజలు హిందూ ముస్లింల ఐక్యతను మరోమారు చాటుతూ దుర్గా పూజను కలిసికట్టుగా నిర్వహించారు. వీరంతా కలిసి తులార్ మాత్‌లోని క్రీడా మైదానంలో దుర్గా మండపాన్ని ఏర్పాటు చేశారు. దుర్గా పూజ కమిటిలో మొత్తం 31 మంది సభ్యులు ఉండగా ఇందులో 18 మంది ముస్లింలు, 13 మంది హిందువులు ఉన్నారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న దుర్గా పూజ కోసం వారు చందాల ద్వారా  రూ.80 వేలు సేకరించారట. అయితే ఇది గతేడాదితో పోలిస్తే తక్కువ అని అంటున్నారు. 

గత ఏడాది రూ.1.2 లక్షల చందాను దుర్గా ఉత్సవాల కోసం సేకరించామని దుర్గా పూజ కమిటిలోని ఓ సభ్యుడు వెల్లడించాడు. ఈ విషయమై దుర్గా పూజ కమిటీ సభ్యుడైన రుహిజ్ మియా మాట్లాడుతూ.. ‘కరోనా ప్రభావం వల్ల ఈసారి దుర్గా ఉత్సవాలకు తగినంత చందాలను సేకరించలేకపోయాం. ఇలా వచ్చిన డబ్బును మేము కొన్ని మంచి కార్యక్రమాలకు వినియోగిస్తుంటాం. ఈసారి ఉత్సవాలను ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కరోనా నియమాలకు అనుగుణంగానే నిర్వహించాం’ అని తెలిపారు. కాగా, ఇప్పుడే కాకుండా గత 19 ఏళ్లుగా ఇలా మత సామరస్యాన్ని చాటుతూ పండగలను కలిసికట్టుగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. కాగా, అగర్తాలా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 59 స్లమ్‌లు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది.