ఏపీలో.. నేటి నుంచే పశు ఆరోగ్య సేవలు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో.. నేటి నుంచే పశు ఆరోగ్య సేవలు

May 19, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి (గురువారం) సంచార పశు ఆరోగ్య సేవలు షురూ కానున్నాయి. సుమారు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. తొలి దశలో రూ.143 కోట్లతో సిద్ధం చేసిన 175 అంబులెన్స్‌లను, మలిదశలో రూ.135 కోట్లతో 165 అంబులెన్స్‌లను గురువారం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించినున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూగ జీవాలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ‘వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్యసేవలు’ పేరుతో నేటి నుంచి (గురువారం) సేవలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున 108 అంబులెన్స్‌ సేవల తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ అంబులెన్స్‌లను తీసుకొస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీటి నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని, అంబులెన్స్‌ సేవల కోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నంబరు 1962 ఏర్పాటు చేశామని సూచించారు.

తాజాగా గ్రామీణాభివృద్ధి, సుపరిపాలనలో జగన్ మోహన్ రెడ్డికి రెండవసారి స్కోచ్ సంస్థ బెస్ట్ సీఎంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది స్కోచ్ సంస్థ.. ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాలు, పరిపాలనా విధానాలు, కొత్త సంస్కరణలు, సంక్షేమ పథకాలపై అధ్యయనం చేస్తుంది. ఈసారి చేపట్టిన సర్వేలో మళ్లీ ఏపీనే దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.