బూస్టర్ డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఉచితంగా చోలె బటూరే అందిస్తున్నాడో చిరు వ్యాపారి. పంజాబ్‌లోని చండీఘడ్‌కు చెందిన సంజయ్ రాణా అనే చిరు వ్యాపారి సైకిల్‌పై చిన్న ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్నాడు. దాదాపు పదిహేనేళ్లుగా వీధుల్లో తిరుగుతూ చోలె బటూరేతోపాటు ఇతర ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి అమ్ముతున్నాడు. గత ఏడాది రాణా ఒక ఆఫర్ ప్రకటించాడు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఉచితంగా చోలే బటూరేని అందించాడు. ఈ విషయం తెలిసిన ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో అతడిని ప్రశంసించారు. ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.తన కూతురు రిధిమ, మేన కోడలు రియా ఇచ్చిన సలహా ప్రకారం ఈ ఆఫర్ ప్రకటించినట్లు సంజయ్ చెప్పాడు.
తాజాగా మరోసారి ఈ ఆఫర్ ప్రకటించాడు సంజయ్. ఈసారి బూస్టర్ డోసు తీసుకున్న వారికి ఉచితంగా చోలే బటూరే అందిస్తానన్నాడు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు అదేరోజు తన దగ్గరికి వచ్చి చోలే బటూరే ఉచితంగా తినొచ్చని ప్రకటించాడు. కోవిడ్ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించి, అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ప్రకటించినట్లు చెప్పాడు. ఇప్పటికీ ఇంకా చాలా మంది వ్యాక్సిన్ తీసుకోలేదని, అందరూ త్వరగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నాడు.