ఢిల్లీ అల్లర్ల ఎఫెక్ట్..  జైశ్రీరామ్ బదులు హరహర మహాదేవ. - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ అల్లర్ల ఎఫెక్ట్..  జైశ్రీరామ్ బదులు హరహర మహాదేవ.

February 29, 2020

Har Har Mahadev

దేశ రాజధాని ఢిల్లీలోని శివ్ విహారీలో ఇకనుంచి రాత్రిపూట తమ కాలనీల్లో గస్తీ కాస్తున్న సమయంలో.. ‘హర్ హర్ మహదేవ్.. వీర్ భజరంగీ’ నినాదాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు కాలనీ వాసులు తెలిపారు. ఇటీవల తమ కాలనీల్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు జైశ్రీరామ్ నినాదాలతో విధ్వంసానికి పాల్పడ్డారని.. వారికి భిన్నంగా ఉండేందుకు తమ నినాదాన్ని మార్చుకున్నామని వారు వెల్లడించారు. ‘మేము హర్ హర్ మహదేవ్ నినాదాలతో మా కాలనీల్లో గస్తీ కాయడం ద్వారా.. ఇళ్లల్లోని మహిళలు, చిన్నారులు, వృద్దులు అభద్రతా భావానికి లోనుకారు’ అని చెబుతున్నారు. ఈ అల్లర్ల గురించి ఈస్ట్ కమల్ విహార్‌కి చెందిన అశుతోష్ ప్రకాశ్ రానా మాట్లాడుతూ.. ‘కొంతమంది అల్లరిమూకలు మా కాలనీల్లోకి చొరబడి జైశ్రీరామ్ నినాదాలు చేశారు. వారు కాలనీలోని ఇళ్లు, దుకాణాలను తగలబెట్టి పారిపోయారు. మతపరమైన నినాదాలు చేయడం ద్వారా ఎవరూ మమ్మల్ని అడ్డుకోలేరు. వారు హింసను ప్రేరేపించడానికే అక్కడికి వచ్చారు. అప్పటినుంచి మా కాలనీలోని ప్రజలు జైశ్రీరామ్ నినాదాన్ని పక్కనపెట్టిన హర్ హర్ మహదేవ్ నినాదం చేస్తున్నారు.  శివ్ విహార్‌లోని ఆలయాల్లోనూ ఇప్పుడు ఇదే నినాదం మారుమోగుతోంది’ అని చెప్పారు.

గురువారం నాటికి దాదాపుగా అల్లర్లు సద్దుమణిగాయని భావించామని.. కానీ కొంతమంది యువకులు మళ్లీ అదే నినాదం చేస్తూ దుకాణాలను లూటీ చేశారని స్థానికులు వాపోయారు.  ‘గత వారం రోజుల నుంచి మేము పనికి కూడా వెళ్లడంలేదు. రాత్రిపూట గస్తీ కాస్తూ ఉదయం పూట కాసేపు పడుకుంటున్నాం. అల్లరిమూకల్లో చాలామంది ముఖాలకు హెల్మెట్లు, స్కార్ఫ్ కట్టుకున్నారు. చాలామంది ముస్లింలు శివ్ విహారీ నుంచి వెళ్లిపోవడంతో.. వరుసగా ఉన్న ఆ ఇళ్లన్నింటికి తాళాలు వేసి కనిపిస్తున్నాయి. ఉదయంపూట ఆ ప్రాంతం నిర్మానుష్యంగా కనిపిస్తోంది. రాత్రిపూట గస్తీ కాస్తున్న కాలనీవాసులు ఆత్మరక్షణ కోసం కారంపొడి ప్యాకెట్లను వెంట పెట్టుకుంటున్నాం. కాలనీలోని మహిళలు గస్తీ సమయంలో వారికి టీ అందిస్తున్నాం’ అంటూ స్థానికుడైన కైలేశ్ చంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.