తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రూ.500 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు లులూ గ్రూపు ముందుకు వచ్చినట్లు కేటీఆర్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. ”జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే ఒక ఉత్పత్తి యూనిట్ కలిగి ఉన్న స్పెయిన్ కంపెనీ ‘కిమో ఫార్మా’రూ.100 కోట్ల పెట్టుబడితో మరో యూనిట్ ఏర్పాటుకు సిద్ధమైంది. స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగ కంపెనీ ‘స్విస్ రే’నగరంలో తన కార్యాలయాన్ని ప్రారంభించనుంది” అని సోమవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
దావోస్‌లో కేటీఆర్.. లులూ గ్రూప్ అధిపతి యూసుఫ్ అలీతో సోమవారం సమావేశమైన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం యూసుఫ్ అలీ మాట్లాడుతూ..” హైదరాబాద్‌లో రూ.500 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో సైతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాం. తెలంగాణ ప్రాంతం నుంచి యూరప్ వంటి దేశాలకు ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో మా యూనిట్ ఉండనుంది. తెలంగాణలో భారీ కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించనున్నాం, హైదరాబాద్‌లో పలు స్థలాలను కూడా ఎంపిక చేశాం, యజమానులతో చర్చలు జరుగుతున్నాయి” అని ఆయన అన్నారు. వెంటనే కేటీఆర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతుల పత్రాలను అక్కడికక్కడే అందజేశారు.
తొలుత 250 మందితో ‘స్విస్ రే’ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు ‘స్విస్ రే’గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వెరోనికా స్కాట్టి బృందం తెలిపింది. దశల వారీగా ఉద్యోగుల సంఖ్యను మరింతగా పెంచుకుంటూ వెళ్తామని వెరోనికా పేర్కొంది. సంస్థ డేటా, డిజిటల్ విభాగాలను బలోపేతం చేయడం, బీమా ఉత్పత్తులను రూపొందించడం, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై తమ హైదరాబాద్ కార్యాలయం పని చేస్తుందని చెప్పారు.