పుట్టబోయే బిడ్డ ఆడో మడో నిర్ణయించేది మగవాళ్లలోని క్రోమోజోములే. కానీ మన సమాజం ఇంకా మూఢనమ్మకాలతో తల్లులను కాల్చుకుతింటోంది. ఆడపిల్లలను కంటున్న కోడళ్లపై అత్తింటోళ్ల దుర్మార్గాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. రెండోసారీ ఆడపిల్లకే జన్మించినందుకు ఓ మహిళపై భర్త, అత్తింటివాళ్లు అత్యంత దారుణంగా దాడి చేశారు.
నడివీధిలోకి ఈడ్చుకొచ్చి పశువును బాదినట్లు బాదారు. కొట్టొద్దని కాళ్లా వేళ్లా పడినా వినిపించుకోలేదు.
ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో ఈ ఘోరం జరిగింది. కూలిపని చేసుకుంటున్న బాధిత మహిళపై అత్తింటివాళ్లు కొన్ని నెలలుగా దూషిస్తున్నారు. తిండి కూడా పెట్టకుండా హింసిస్తున్నారు. ‘రెండోసారి ఆడపిల్ల పుట్టడంతో వేధింపులు మరింత పెరిగాయి. మగబిడ్డను ఎందుకు కనలేదని కొడుతున్నారు’ అని బాధితురాలు వాపోయింది. దాడిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.