In Sankranti message, KCR vows agriculture revolution in India
mictv telugu

రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే సంపూర్ణక్రాంతి

January 15, 2023

 

In Sankranti message, KCR vows agriculture revolution in India

దేశ, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సంక్రాంతి పండుగను ఆనందంగా చేసుకోవాలని, ప్రతి ఇల్లూ సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. ‘పంటపొలాల నుంచి ధాన్యపు రాశులు ఇండ్లకు చేరుకున్న శుభ సందర్భంలో రైతన్న జరుపుకునే సంబురమే సంక్రాంతి.. నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ’ అన్నారు. తెలంగాణ వ్యవసాయరంగం విప్లవాత్మక ప్రగతి దేశమంతటికీ విస్తరించి సంపూర్ణ క్రాంతి సిద్ధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే జీవితానికి ఢోకా లేదనే విశ్వాసం రాష్ట్ర రైతుల జీవితాల్లో తొణికిసలాడుతోందని, ఇదే విశ్వాసాన్ని దేశ రైతాంగంలో పెంపొందిస్తమని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పునరుజ్జీవింప చేసేందుకు చేపట్టిన కార్యాచరణతో తెలంగాణ పల్లెలు పచ్చని పంటపొలాలు, ధాన్యపురాశులు, పాడిపశువులు, కమ్మని మట్టివాసనలతో సంక్రాంతి శోభను సంతరించుకుని వైభవోపేతంగా వెలుగొందుతున్నాయని సీఎం కేసీఆర్‌ పేరొన్నారు. తెలంగాణలో వ్యవసాయరంగం సాధించిన ప్రగతి నేడు యావత్‌ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసే దిశగా లక్షలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ అని స్పష్టంచేశారు

“రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2,16,000 కోట్లకుపైగా ఖర్చుచేసింది. రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఇది తార్కాణం.రాష్ట్ర ఆవిర్భావం నాటికి కోటి 31 లక్షల ఎకరాలు మాత్రమే సాగు విస్తీర్ణం. ఇప్పుడు అది 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెరగడం దేశ వ్యవసాయరంగంలో విప్లవాత్మక పరిణామం. ఒకనాడు దండుగ అన్న వ్యవసాయం నేడు తెలంగాణలో పండుగలా మారింది’’ అని కేసీఆర్ అన్నారు.