తెలంగాణలో.. నేడు ఆటోలు, క్యాబ్‌లు బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో.. నేడు ఆటోలు, క్యాబ్‌లు బంద్

May 19, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నేడు ఆటోలు, క్యాబ్‌లు నిలిచిపోయినట్లు డ్రైవర్ల యూనియన్ జేఏసీ తెలిపింది. బుధవారం అర్ధరాత్రి నుంచే ఆటోలు, క్యాబ్‌లు, లారీల సేవలు నిలిపివేశామని పేర్కొన్నారు. ఇందుకు కారణం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం 2019 అమలు చేస్తూ, జరిమానాల పేరుతో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను నిలుపుదోపిడీ చేస్తోందని, ఒక్క రోజు బంద్‌‌కు పిలుపునిచ్చామని అన్నారు.

జేఏసీ కన్వీనర్ వెంకటేశం మాట్లాడుతూ.. ”పెరిగిన ఇంధన ధరలతో అష్టకష్టాలు పడి వాహనాలు నడుపుతున్నాం. అలాంటి మాపై అదనపు భారం మోపడం దారుణం. గురువారం ట్రాన్స్‌పోర్టు భవన్ ముట్టడికి పిలుపునిచ్చాం. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్రాన్స్పోర్ట్ భవన్ వరకు భారీ ర్యాలీ తీస్తాం. ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్‌ఎఫ్, క్యాబ్, ఆటో, లారీ సంఘాలు బంద్‌లో పాల్గొంటాయి” అని ఆయన అన్నారు.

మరోపక్క తెలంగాణ ఆర్టీసీ..హైదరాబాద్ వ్యాప్తంగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపింది. బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రధాన మార్గాల్లో ప్రయాణికుల అవసరాల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు గ్రేటర్ జోన్ ఈడీ యాదగిరి పేర్కొన్నారు. బస్సులు అవసరమైనవారు వెంటనే 9959226180, 9959226154 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.