తెలంగాణలో.. తగ్గిన మద్యం కిక్కు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో.. తగ్గిన మద్యం కిక్కు

May 29, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే మద్యం ధరలను పెంచుతూ కేసీఆర్ సర్కార్ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. పెరిగిన ధరల కారణంగా మందుబాబులు డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారు. మరికొంతమంది తాగకుండా ఉండలేక అప్పులు చేసి, నానా తిప్పలు పడుతున్నారు. కానీ, ఆబ్కారీ శాఖ ఆదాయం మాత్రం రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. అన్ని రకాల బీర్లు, మద్యం బ్రాండ్‌లపై కనిష్టంగా రూ. 20 నుంచి గరిష్టంగా రూ. 160 వరకు పెరగడంతో ఒక్కో బ్రాండ్ ధర ఒక్కోవిధంగా అమ్ముతున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతికి చెందిన మద్యం ప్రియులు ఏం చేయాలో దిక్కుతోచక అయోమాయంలో పడ్డారు.

ఇక, పెరిగిన ధరలతో మద్యం ప్రియులు క్రమ క్రమంగా తగ్గిపోతున్నారు. వీకెండ్ వస్తే, వైన్స్ షాపుల వద్ద క్యూ కట్టే మందుబాబులు రాను రాను మద్యానికి దూరమైపోతున్నారు. పలువురు మద్యం షాపుల యాజమానులు మాట్లాడుతూ..’ధరలు పెరిగిన రోజు నుంచి ఇప్పటివరకూ రంగారెడ్డి జిల్లాలో కేవలం 3.6 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడుపోయాయి. 40 వేల కేసుల బీర్ల అమ్మకాలు పడిపోయాయి. ఇక, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలో మద్యం విక్రయాలు క్రమ క్రమంగా తగ్గుతున్నాయి’ అని ఆవేదన చెందారు.

”బీర్లపై పెరిగిన ధరలు స్వల్పమే అయినా, గతవారంతో పోలిస్తే, వినియోగం భారీగా తగ్గింది. మేడ్చల్ జిల్లాలో ఈ నెల మొదటి పది రోజుల్లో 85 వేల కేసుల బీర్లు విక్రయిస్తే, ఈ నెల 19 నుంచి 28 వరకు 80 వేల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఈ నెల 8వ తేదీ నుంచి 17 వరకు గ్రేటర్‌లో రూ.315 కోట్ల ఆదాయం నమోదు కాగా, 19వ తేదీ నుంచి 28 వరకు రూ.351 కోట్లకు ఆదాయం పెరిగింది. ధరల పెంపునకు ముందు రూ.192 కోట్ల ఆదాయం లభించగా, ప్రస్తుతం రూ. 212 కోట్లకు పెరిగింది” అని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు.