తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో గురువారం ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య మైక్ విషయంలో వాగ్వివాదం జరిగిన సంఘటన చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మహబూబాబాద్‌లో టీఆర్ఎస్ రైతు దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో భాగంగా వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంత్రి సత్యవతి రాథోడ్ ఎదుటే జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతుండగా, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్యలోనే మైకు లాక్కున్నారు.
దీంతో ఎంపీ కవిత బిత్తరపోయారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే శంకర్ నాయక్ అధ్యక్షతన అనగానే, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కల్పించుకొని అలా కాదు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు కవిత అధ్యక్షతన అనాలి’ అని మంత్రికి సూచించారు.
మరోపక్క టీఆర్ఎస్కు సంబంధించి మహబూబాబాద్ జిల్లా శాఖలో విభేదాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. గతకొన్ని రోజులుగా ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్‌ల మధ్య తలెత్తిన ఈ విభేదాలు గురువారం రోజున బట్టబయలయ్యాయని గుసగుసలాడుతున్నారు. ఈ ఇద్దరు నేతలు తమ మధ్య విభేదాలను వారికి వారే బహిర్గతం చేసుకున్నారని విమర్శిస్తున్నారు.