విజయవాడలో ఘోరం జరిగింది. ఓ వివాహితను ఓ వ్యక్తి రెండ్రోజులు బంధించి, అత్యాచారం చేసి, విషయం ఎవరికీ చెప్పకూడదని ఆమె మెడలో తాళి కట్టేశాడు. అత్యాచారాల్లో కొత్త ఒరవడిగా చెప్పుకుంటున్న ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జక్కంపూడి వైఎస్సార్ కాలనీకి చెందిన వివాహితకు ఎనిమిదేళ్ల కింద పెళ్లైంది. ఆమె శ్రీనివాస మహల్ సమీపంలో ఉన్న మొబైల్ షాపులో పని చేస్తూ ఉండేది. ఈ క్రమంలో షాపులో తనతో పాటు పనిచేసే టీం లీడర్ రమేష్ బాబు ఆమెకు మాయమాటలు చెప్పి పటమటలోని ఓ ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించాడు.
రెండ్రోజుల పాటు వివాహితపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక, ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు ఆమె మెడలో తాళి కూడా కట్టాడు. అంటే రెండో భర్తలాగా అన్నమాట. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సదరు మహిళ గత నెల 7వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పారిపోయి భర్త ఇంటికి వచ్చేసింది. రెండ్రోజులు ఎక్కడికి వెళ్లావని భర్త కరీముల్లా ప్రశ్నించగా, ఆమె సమాధానమివ్వలేదు. మానసికంగా బాగా కుంగిపోయి ఉండడంతో భర్త అప్పటికి ఊరుకున్నాడు. రెండ్రోజులు అయిన తర్వాత ఇంకా ఆమె డిప్రెషన్లోకి వెళ్లడంతో ఈ సారి భర్త గట్టిగా నిలదీశాడు. దాంతో నిజం చెప్పేసింది. దాంతో ఆగ్రహించిన భర్త కరీముల్లా భార్యతో కలిసి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అత్యాచార ఘటనలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నా.. ఇలా వివాహిత మెడలో తాళి కట్టేసిన సంఘటన మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.