తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సచివాలయ ప్రారంభోత్సవంను వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ప్రారంభోత్సవ తేదీని ప్రకటించనున్నారు. దాదాపు సచివాలయం పనులు పూర్తి కావడంతో కేసీఆర్ పుట్టినరోజున అంటే ఈనెల 17వ తేదీన సచివాలయాన్ని ప్రారంభించేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు.
ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ భావించింది. దేశంలోని పలు ప్రముఖనేతలను కూడా ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం అందించారు. దాంతో పాటు భారీ బహిరంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ వేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగార మోగడం, కోడ్ అమల్లోకి రావడంతో సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడాల్సి వచ్చింది.
ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. మరోవైపు ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చింది. రెండు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాలు, తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్ జారీ కానుంది. ఫిబ్రవరి 23 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన నామినేషన్లు ఉపసంహరణ ఉంటుంది. మొత్తం 16 స్థానాలకు మార్చ్ 13న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. మార్చ్ 16వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు.