చెత్తతో ధూపం కడ్డీలు. హైదరాబాదీ గృహిణి ఆవిష్కరణ  - MicTv.in - Telugu News
mictv telugu

చెత్తతో ధూపం కడ్డీలు. హైదరాబాదీ గృహిణి ఆవిష్కరణ 

September 6, 2021

Incense cones from kitchen waste

ప్ర‌స్తుతం ఏ చిన్న వ‌స్తువు కావాల‌న్నా మార్కెట్‌కు వెళ్లాల్సిందే. పూజా సామాగ్రి మొద‌లు అన్ని వ‌స్తువులు భారీగా డ‌బ్బులు వెచ్చించి మ‌రీ కొనుగోలు చేస్తూ ఉంటాం. మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ధూప‌పు క‌డ్డీల‌లో శ‌రీరంతో పాటు ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించే ర‌సాయ‌నాలు ఉప‌యోగిస్తారు.ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌కు చెందిన ప‌ద్మిని రంగ‌రాజ‌న్ అనే మ‌హిళ వినూత్న ఆలోచ‌న‌లో ముందుకువ‌చ్చారు. ప్ర‌తి ఇంటిలో విరివిగా వినియోగించే వ్యర్థాలతో ధూప‌ం కడ్డీలను త‌యారు చేస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు లేకుండా వంటగది, పూజగది వ్యర్థాల‌తో ఆమె వీటిని త‌యారు చేస్తున్నారు. 

ఈ ధూపాన్ని త‌యారు చేసే విధానం

 ముందుగా  కూర‌గాయల తొక్కును, పూజ అయిపోయాక ఎండిపోయిన గులాబీ, మల్లెపూలు వంటి పూజ వ్యర్థాలు సేకరించి పెట్టుకోవాలి. తర్వాత మూడు నుంచి నాలుగు రోజులు బాగా ఎండ‌బెట్టాలి. తర్వాత పొడి చేసుకోవాలి. మూడు చెంచాల వ్య‌ర్థాల పొడిలో, మూడు చెంచాల రంపపు పొట్టు, మూడు చెంచాల కొబ్బరి ఊక, కొన్ని చుక్క‌ల కొబ్బ‌రి నూనె కలిపి ముద్ద‌లా త‌యారు చేసుకోవాలి. అనంత‌రం మనకు కావల్సిన సైజులో తయారు చేసుకోవాలి. వాటిని పూర్తిగా నీడలో ఆరబెట్టుకోవాలి.  గులాబీ రేకుల పొడిని, పర్ ఫ్యూమ్ ను కూడా క‌ల‌ుపుకుంటే ఇల్లంతా సుగంధభ‌రితంగా మారుతుంది.  6 సెంటీ మీట‌ర్ల కడ్డీ స‌గ‌టున రెండు గంట‌ల పాటు మండుతుంది.