గుంటూరులో దళిత కుటుంబంపై దాడి..  - MicTv.in - Telugu News
mictv telugu

గుంటూరులో దళిత కుటుంబంపై దాడి.. 

September 18, 2020

Incident on Dalit family in Guntur ..

ఈమధ్య ఏపీలో వరుసగా దళితులపై దాడులు జరుగుతున్నాయి. నూతన్ నాయుడు ఇంట్లో పనిచేస్తున్న దళిత వ్యక్తికి శిరోమండనం గురించి మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా బాపట్లలో ఈ ఘటన చోటు చేసుకుంది.  20 మంది యువకులు కలిసి మూకుమ్ముడిగా ఓ దళిత కుటుంబంపై దాడిచేశారు. ఈ ఘటనలో దళిత కుటుంబ సభ్యులు గాయపడ్డారు. పట్టణంలోని 11వ వార్డు దేవుడి మాన్యానికి చెందిన భానుప్రసాద్ మార్చురీ బాక్సులు అద్దెకు ఇస్తుంటాడు. యథావిధిగా భానుప్రసాద్ బుధవారం రాత్రి మార్చురీ బాక్సు తీసుకుని ఆటోలో ఇంటికి వెళుతున్నాడు. కారుమూరి హనుమంతరావు కాలనీ వద్ద రోడ్డుపై మద్యం తాగుతున్న కొందరు యువకులు ఆటోను అడ్డగించారు. భానుప్రసాద్‌తో అసభ్యంగా మాట్లాడుతూ వాగ్వివాదానికి దిగారు. గొడవ జరుగుతుండడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు.

ఆ తర్వాత భానుప్రసాద్ ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లోకి వెళ్లగానే ఓ 20 మంది యువకులు గుంపుగా అతడి ఇంటికి వెళ్లి దాడిచేశారు. ఊహించని విధంగా వారు దాడి చేస్తుండటంతో భానుప్రసాద్ షాక్ అయ్యాడు. అతని భార్య రాహేలు, ఇద్దరు కుమారులను విచక్షణ రహితంగా కొడుతూ కులం పేరుతో దూషించారు. వారి దాడిలో భానుప్రసాద్‌తో పాటు భార్య, పిల్లలు స్వల్పంగా గాయపడ్డారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. డీఎస్పీ పర్యవేక్షణలో యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెల్లడించారు. కాగా, ఈ రోజు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మరుప్రోలు వారి పాలెం గ్రామంలో బాధిత దళిత కుటుంబాలను పరామర్శించారు. దళిత మహిళను  ఎందుకు దూషిస్తున్నారు అని అడిగినందుకు ఆ మహిళ సోదరునిపై దాడి చేసి మరొక చుండూరు ఘటన చూపిస్తాం అని బెదిరించారని తెలిపారు. 12 మంది దుండగుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయమని బాధితులు పోలీస్ స్టేషన్‌లో కేసు పెడితే వారితో పాటుగా దాడికి గురైన ఎస్సీల మీద కూడా కేసు నమోదు చేయడం దారుణమైన చర్య అని టీడీపీ నాయకులు అన్నారు. ఈ కేసును ఎటువంటి పక్షపాతం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా నీతిగా నిజాయితీగా విచారణ జరపాలని.. వెంటనే బాధితుల మీద  అక్రమంగా పెట్టిన కేసును కొట్టివేయాలని అని డిమాండ్ అన్నారు.