పించన్ల కోసం దరఖాస్తు చేసుకన్నా ఎందుకు ఇవ్వడంలేదని ఏకంగా మహిళా పంచాయతీ కార్యదర్శిపైనే దాడికి పాల్పడ్డారు కొందరు యువకులు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం బాదలాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ కార్యదర్శి శైలజ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నప్పుడు మద్యం మత్తులో ఉన్న ఏడుగురు యువకులు అక్కడికి వెళ్లారని సమాచారం. వారి కుటుంబ సభ్యులు పెన్షన్ కోసం ధరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదని అడిగారు. ఆన్‌లైన్ చేయడం వరకే తన బాధ్యత అని.. మిగిలిన ప్రక్రియ పైనుంచి జరగాలని సదరు మహిళా కార్యదర్శి సమాధానం చెప్పారు. అయినా వారు వినకుండా వాగ్వాదానికి దిగారు. కులం పేరుతో దూషిస్తూ.. ఆమె ఓ మహిళ అన్న విషయం కూడా మరిచిపోయి, బండ బూతులు తిట్టారు.
అంతటితో ఆగకుండా ఆమెపై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. వెంటనే ఆమె భర్త అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆయనపై కూడా దాడి చేశారట. గ్రామస్తులు అడ్డుకోవడంతో యువకులు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధిత కార్యదర్శి మిర్యాలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని బాధిత కార్యదర్శి ఆరోపిస్తున్నారు.