రాజస్తాన్ వెళ్లిన తెలంగాణ పోలీసులపై దాడి - MicTv.in - Telugu News
mictv telugu

రాజస్తాన్ వెళ్లిన తెలంగాణ పోలీసులపై దాడి

October 16, 2020

ఓఎల్ఎక్స్‌లో పాత బైకుల ఫోటోలు పెట్టి తక్కువ ధరకే అమ్ముతామని పలువురిని మోసం చేస్తున్న ముఠాను పోలీసులు రాజస్తాన్‌లో పట్టుకున్నారు. వారిని పట్టుకోవడానికి రాజస్తాన్ వెళ్లిన తెలంగాణ పోలీసులపై సదరు నిందితులు ఎదురుదాడికి పాల్పడ్డారు. స్థానిక భరత్‌పూర్‌ జిల్లాలోని కళ్యాణ్‌పురి, చౌ వేరా గ్రామాల్లో ఉన్న నిందితుల ఇళ్లపై పోలీసులు అర్ధరాత్రి దాడి చేసి, వారిని పట్టుకున్నారు. పది మంది సభ్యులు గల తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల బృందానికి భరత్‌పూర్‌ జిల్లాలోని వివిధ స్టేషన్లలో పనిచేసే వంద మంది స్థానిక పోలీసులు సహాయం చేశారు. అందరూ కలిసి కళ్యాణ్‌పురి, చౌ వేరా గ్రామాల్లోని నిందితుల ఇళ్లపై రైడ్‌ చేశారు. 

ఈ విషయం తెలుసుకున్న సదరు ముఠా, వారి కుటుంబ సభ్యులు పోలీసులపై ఎదురుదాడికి పాల్పడ్డారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. కాసేపటివరకు ముఠాకు పోలీసులకు మధ్య హోరాహోరీ దాడి జరిగింది. అనంతరం నిందితులు అక్కడినుంచి పారిపోయారు. దీంతో పోలీసులు వారికోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉమ్రాన్ ఖాన్, వాజిత్ ఖాన్, ఇర్ఫాన్‌, తారీఫ్ ఖాన్, సాహిల్, సత్యవీర్ సింగ్, మోహన్ సింగ్, రాహుల్, అజారుద్దీన్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా, ఐదు రోజుల క్రితం 8 మందిని అరెస్టు చేయగా, నేడు 10 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.