చర్చిలో 5 కోట్ల నగదు.. మొత్తం రూ. 100 కోట్లు అక్రమంగా.. - MicTv.in - Telugu News
mictv telugu

చర్చిలో 5 కోట్ల నగదు.. మొత్తం రూ. 100 కోట్లు అక్రమంగా..

November 7, 2020

Income tax raids at Kerala church, foreign funding rules violation suspected

ఓ చర్చిలో కళ్లు తిరిగే నగదు కట్టలు బయటపడ్డాయి. ఏకంగా రూ. 5 కోట్లకుపైగా నోట్లు బయటపడ్డాయి. విదేశాల నుంచి 100 కోట్లకుపైగా అక్రమ నిధులు సేకరించినట్లు తేలింది. కేరళలోని పత్తినంతిట్టలో ఉన్న ఎవాంజలిస్ట్ కేపీ యోహనన్స్ బిలీవర్స్ చర్చి సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు  మెరుపుదాడులు చేశారు. విదేశాల నుంచి అక్రమ మార్గంలో భారీగా నిధులు సేకరిస్తున్నట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ, విదేశీ విరాళాల నియంత్రణ చట్టాలను అడ్డగోలుగా ఉల్లంఘించి ఈ నిధులు సేకరిస్తున్నట్లు తెలసింది. 

మూడు రోజులుగా జరిపిన దాడుల్లో చర్చి అక్రమాలు బయటపడ్డాయని ఐటీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఇతర చర్చీల్లోనూ దాడులు సాగుతున్నాయి. విదేశీ నిధులతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో కేంద్రం ఇప్పటికే ఎన్జీవోకు నిధులపై ఆంక్షలు విధించడం తెలిసిందే. ప్రముఖ హక్కుల సంస్థ ఆమ్నెస్టీపైనా కొరడా ఝళిపించింది. ఈ నేపథ్యంలో చర్చీలో పెద్దసంఖ్యలో ఉన్న కేరళలో దాడులు మొదలయ్యాయి. బిలీవర్స్ చర్చిపై ఇదివరకే ఆరోపణలు రావడంతో ఆ సంస్థ కింద పనిచేస్తున్న ఎన్జీవోలు విదేశీ నిధులు తీసుకోవద్దని కేంద్రం మూడేళ్ల కిందటే ఆదేశాలు జారీ చేసింది. దొంగపేర్లతో చర్చి యథావిధిగా విదేశా నిధులు పొందుతున్నట్లు తెలియడంతో సోదాలు నిర్వహించారు. గత మూడేళ్లతలో రూ.100 కోట్లు విదేశీ నిధులు అందాయని, పూర్తి వివరణాలను తర్వాత వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.