రూ. 2000 కోట్లు.. బాబు మాజీ కార్యదర్శి ఇంటిపై దాడులతో సహా - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 2000 కోట్లు.. బాబు మాజీ కార్యదర్శి ఇంటిపై దాడులతో సహా

February 13, 2020

Chandrababu Naidu

తెలుగు రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, పుణే తదితర చోట్ల 40 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో రూ. 2 వేల కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. లెక్కచూపని రూ. 2 వేల కోట్ల ఆస్తులను గుర్తించినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. దాడులు జరిగిన ప్రాంతాల్లో మాజీ సీఎం చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు ఇల్లు కూడా ఉంది. 

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఢిల్లీ, పుణేల్లో దాడులు జరిగాయి. ఏపీ, తెలంగాణలకు చెందిన మూడు ప్రముఖ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల కార్యాలయాల్లో సోదాలు సాగాయి. బోగస్ కంపెనీల ఏర్పాటు, బోగస్ సబ్ కాంట్రాక్టులు, నకిలీ బిల్లులు, విదేశాల నుంచి అక్రమ పెట్టుబడుల ప్రవాహం, పన్ను ఎగవేత తదితర మోసాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు రూ. 85 లక్షల అక్రమ నగదు, 75 లక్షల నగలు, 25 బ్యాంక్ లాకర్లు సీజ్ చేశామని అధికారులు వెల్లడించారు. 

చంద్రబాబు నాయుడు వద్ద 2019 వరకు వ్యక్తిగత కార్యదర్శిగా పదేళ్లు పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావు నివాసాల్లో ఈ నెల 7 ఐటీ దాడులు నిర్వహించారు. అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని శ్రీనివాసరావు అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన చంద్రబాబుకు బినామీగా ఉన్నారని ప్రచారంలో ఉంది.  విజయవాడ, హైదరాబాద్‌లోని ఆయన నివాసాల్లో ఏకకాలంలో దాదాపు 36 గంటల పాటు సోదాలు జరిపారు. అలాగే మాజీ మంత్రి నారా లోకేష్‌ ప్రధాన అనుచరుడు కిలారి రాజేశ్ ఇళ్లల్లో, కంపెనీ కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు సాగాయి.