Home > Featured > 36వేల మంది సఫాయి కార్మికుల వేతనం పెంపు.. కేసీఆర్

36వేల మంది సఫాయి కార్మికుల వేతనం పెంపు.. కేసీఆర్

CM KCR...

సెప్టెంబర్ 6 నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై మార్గదర్శకం చేసేందుకు కేసీఆర్ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వచ్చే నెల 3న మద్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36వేల మంది సఫాయి కార్మికుల వేతనాన్ని రూ.8,500కు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

పంచాయతీరాజ్ శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జత చేసి, నెలకు రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు గ్రామానికి ఒకరు చొప్పున మండల స్థాయి అధికారులను ఇన్‌చార్జులుగా నియమించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. మండల, జిల్లా పరిషత్‌లను క్రియాశీలకంగా మార్చేందుకు అవసరమైన సిఫారసులను కలెక్టర్ల నుంచి స్వీకరించి, నిబంధనలు రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు వెల్లివిరియాలని, ప్రణాళికా పద్థతిలో గ్రామాల అభివృద్ధి జరగాలని, నియంత్రిత పద్ధతిలో నిధుల వినియోగం జరగాలని, మొత్తంగా విస్తృత ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ బృహత్తర లక్ష్యం నెరవేర్చడానికి అవసరమైన ఒరవడి అవడానికి 30 రోజుల కార్యాచరణకు నాంది పలకాలని సీఎం ఆకాంక్షించారు. మొదట 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ, అధికారుల నుంచి వచ్చిన సూచన మేరకు మొదటి దశలో 30 రోజుల పాటు నిర్వహించి, మరో దశ కొనసాగించాలని నిర్ణయించారు.

గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించినట్లు కూడా సీఎం వెల్లడించారు.

గ్రామాల్లో అమలు చేయాల్సిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం ప్రగతి భవన్‌లో 7 గంటల పాటు సమీక్ష జరిగింది. పలువురు మంత్రులు, కలెక్టర్లు, డీపీఓలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated : 3 Sep 2019 1:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top