Increased pulses prices in India
mictv telugu

నూనె తర్వాత వంటింటికి మరో చిల్లు.. పెరిగిన పప్పుల ధరలు

August 10, 2022

దేశంలో కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో కందిపప్పు, మినప్పప్పు ధరలు భారీగా పెరిగాయి. గత ఆరు వారాల్లో 15 శాతానికి పైగా ధరలు పెరిగాయి. పంటలు దెబ్బతిని ఉత్పత్తి పడిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అటు తగినంత స్టాకు కూడా అందుబాటులో లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పదని పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునే వ్యాపారి హర్షరాయ్ తెలిపారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పప్పు ధాన్యాల సాగు 4.6 శాతం తగ్గింది. అటు మహారాష్ట్రలోని లాతూర్ మార్కెట్‌లో మంచి క్వాలిటీ కలిగిన కంది పప్పు నెలన్నర క్రితం రూ. 97 ఉంటే ఇప్పుడు దాని ధర కేజీకి రూ. 115కి పెరిగింది. ‘రైతులు సోయాబీన్‌కు మారడంతో కందిపప్పు సాగు తగ్గింది. ఆఫ్రికా నుంచి 5 లక్షల టన్నులు దిగుమతి చేసుకోబోతున్నాం.

ఈ స్టాకు ఆగస్టు లేదా సెప్టెంబరులో వచ్చే అవకాశముంద’ని హర్షరాయ్ పేర్కొన్నారు. అటు మినుముల సాగు రెండు శాతం పడిపోయింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో మినుము పంట దెబ్బతిన్నదని, కొరత రాకుండా ఉండేందుకు మయన్మార్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని 4పీ ఇంటర్నేషనల్ ఎండీ బీ క్రిష్ణమూర్తి వెల్లడించారు. అయితే శెనగలు, పెసరపప్పు ధరలు మాత్రం స్థిరంగా ఉండడం కొంత ఊరట కలిగించే విషయమని తెలిపారు. కాగా, ఇప్పటివరకు వంట నూనె ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులకు గురికాగా, ఇప్పుడు పప్పుల ధరలు కూడా అదే బాటలో పయనిస్తుండడంతో వంటింటి బడ్జెట్ పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు అంతర్జాతీయ పరిణామాలు వేగంగా మారుతుండడంతో రాబోయే ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు పొదుపు పాటించాలని సూచిస్తున్నారు.