వణికిస్తున్న చలి.. తెలంగాణ గజగజ..
తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్నది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా నమోదవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా.. పట్టణాల్లోనూ రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాత్రిపూట పలు ప్రాంతాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత నమోదవుతోంది. మంగళవారం రాత్రి అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరులో 8.9, హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక హైదరాబాద్ నగరంలో సాయంత్రం 6 దాటితే చాలు చలిగాలులు వణికిస్తున్నాయి. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీల నుంచి వచ్చే నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఫుట్పాత్‌లు, బస్టాండ్ల వద్ద ఉండే వారు నైట్ షెల్టర్లను ఆశ్రయిస్తున్నారు. గతంతో పోలిస్తే చలికాలం మొదలైనప్పటి నుంచి వీటిలో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనుల కోసం బయట ఉంటూ రాత్రయ్యేసరికి షెల్టర్లకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం షెల్టర్లలో బెడ్లన్నీ ఫుల్ అయిపోతున్నాయి.
తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం పొడివాతావరణం ఉంటుంది. గాలిలో తేమ సాధారణంకన్నా అధికంగా ఉంది. తెల్లవారుజామున పొగమంచు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ శాఖ సూచించింది.